ఇంటర్ ఫలితాల్లో ఐదేండ్లలో ఇదే టాప్ పర్సెంటేజ్.. ఫస్టియర్, సెకండియర్లో అమ్మాయిలదే హవా

ఇంటర్ ఫలితాల్లో ఐదేండ్లలో ఇదే టాప్ పర్సెంటేజ్.. ఫస్టియర్, సెకండియర్లో అమ్మాయిలదే హవా
  • ఇంటర్‌‌‌‌‌‌‌‌లో  పెరిగిన గ్రాఫ్‌‌‌‌.. 
  • ఫస్టియర్​లో 66.94%.. సెకండియర్​లో 75.61%  మంది పాస్ 
  • ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్..  సిరిసిల్ల లాస్ట్.. 
  • 78%  పాస్‌‌‌‌తో ఎంపీసీ స్టూడెంట్స్‌‌‌‌ సత్తా
  • హెచ్ఈసీలో సగం మందే..
  • ఇవాళ్టి (ఏప్రిల్ 13) నుంచి రీకౌంటింగ్‌‌‌‌కు దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: 
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. గత ఐదేండ్లతో పోలిస్తే ఈసారి రికార్డు రిజల్ట్ నమోదైంది. ఇంటర్ ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లో 66.94%.. సెకండియర్​లో 75.61% మంది పాసయ్యారు. ఈ సారి కూడా  ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. మరోపక్క రిజల్ట్స్‌‌‌‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టాప్‌‌‌‌లో ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా చివరిస్థానంలో నిలిచింది.  

ఆదివారం ఇంటర్మీడియెట్ బోర్డులో కళాశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన, సీజీజీ డీజీ రవిగుప్త, ఇంటర్ బోర్డు సీవోఈ జయప్రదబాయి తదితరులతో కలిసి  ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఫలితాలను విడుదల చేశారు. గడిచిన ఐదేండ్ల ట్రెండ్‌‌‌‌ను గమనిస్తే.. ఇంటర్ ఫలితాల గ్రాఫ్ పెరిగింది. సెకండియర్‌‌‌‌‌‌‌‌లో 2022లో 68.68 శాతం, 2023లో 67.27 శాతం, 2024లో 69.49 శాతం, 2025లో 71.43 శాతంగా ఉన్న సెకండియర్ పాస్ పర్సంటేజీ.. ఈ సారి 75.61 శాతానికి పెరిగింది. ఇది గత ఐదేండ్లలోనే అత్యధికం కావడం విశేషం. ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లోనూ గత ఐదేండ్లలో ఇదే అత్యుత్తమ ఫలితం. 2024లో 61.08 శాతం, 2025లో 66.91 శాతం ఉండగా.. ఈ సారి 66.94 శాతానికి చేరింది. 


ఇంటర్ ఫస్టియర్‌‌లో  మొత్తం 4,89,123 మంది పరీక్ష  రాయగా..  3,23,807 మంది పాసయ్యారు. జనరల్ కేటగిరీలో 4,41,863 మంది ఎగ్జామ్ రాస్తే.. 2,95,780 మంది, ఒకేషనల్ కేటగిరీలో 47,260 మందికి గానూ 28,027 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కేటగిరీలో అమ్మాయిలు 2,24,436 మందికి 1,67,045 మంది (74.43%), ఒకేషనల్ కేటగిరీలో 24,674 మందికి గానూ 18,286 (74.11%) మంది పాసయ్యారు. బాయ్స్‌లో జనరల్ కేటగిరీలో 2,17,427 మందికిగానూ 1,28,734 (59.21%) మంది, ఒకేషనల్ కేటగిరీలో 22,586 మందికి 9,741 (43.13%) మంది ఉత్తీర్ణత సాధించారు.

  జనరల్ కేటగిరీలో ఫస్టియర్‌‌లో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 77.31శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో ఉండగా, రంగారెడ్డి 76.38 శాతం, జయశంకర్ భూపాలపల్లి 73.04 శాతంతో తర్వాతి వరుసలో నిలిచాయి.  49.05 శాతంతో రాజన్న సిరిసిల్లా జిల్లా, 49.11శాతంతో మహబూబాబాద్, 49.40 శాతంతో  కామారెడ్డి జిల్లాలు చివరిస్థానంలో నిలిచాయి. ఒకేషనల్ కేటగిరీలో మెదక్ 73.46 శాతంతో టాప్ లో ఉండగా, మహబూబాబాద్ 44.91శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 

  • దుమ్మురేపిన ఎంపీసీ స్టూడెంట్లు..

 గ్రూపుల వారీగా ఫలితాలను చూస్తే.. ఎంపీసీ విద్యార్థులు ముందంజలో ఉన్నారు.  సెకండియర్ ఎంపీసీలో 78.01 శాతం మంది పాస్ కాగా, బైపీసీలో 76.04 శాతం, ఎంఈసీలో 67.91 శాతం, సీఈసీలో 49.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే, హెచ్ఈసీలో మాత్రం కేవలం 49.25 శాతం మందే పాస్ అయ్యారు. దాదాపు సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫస్టియర్‌‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. ఎంపీసీలో 75.51శాతం మంది పాస్ కాగా, బైపీసీలో 72.39 శాతం, ఎంఈసీలో 64.07 శాతం, సీఈసీలో 44.90 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, హెచ్ఈసీలో కేవలం 34.34 శాతం మందే పాసయ్యారు. 

  • రీకౌంటింగ్‌కు దరఖాస్తులు

ఇంటర్మీడియెట్ ఆన్సర్ షీట్ల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సోమవారంనుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ నెల 13 నుంచి 20 వరకు ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  రీకౌంటింగ్‌కు రూ. వంద, రీ-వెరిఫికేషన్‌కు రూ. 800 ఫీజు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://tsbie.cgg.gov.in ఇంటర్ బోర్డు వెబ్ సైట్ చూడాలని, ఈ సైట్ ద్వారానే అప్లై చేసుకోవచ్చని చెప్పారు.  దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ అడ్రస్, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు.  మరోపక్క ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులు ఉంటే,  రిజల్ట్ వచ్చిన పది రోజులలోపు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయాలని  పేర్కొన్నారు.

  • సెకండియర్ లో గర్ల్స్ సత్తా..

ఇంటర్ సెకండియర్‌‌లో అమ్మాయిలు సత్తా చాటారు. అబ్బాయిలతో పోలిస్తే ఏకంగా 12 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.  జనరల్ కేటగిరీలో 4,11,474  మందికి గానూ 3,11,112 (75.61%) మంది, ఒకేషనల్ కేటగిరీలో 42,458 మందికి గానూ 30,872 (72.21%) మంది పాసయ్యారు.  అమ్మాయిలు 2,12,930 మంది ఎగ్జామ్‌ రాయగా.. 1,74,136 (81.78%) మంది, అబ్బాయిలు 1,98,544 మంది గానూ 1,36,976 (68.99%) మంది  పాస్‌ అయ్యారు. వారిద్దరి మధ్య ఏకంగా 12.79 శాతం గ్యాప్ ఉండటం విశేషం.  జనరల్ కేటగిరీలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 82.73 శాతంతో టాప్​లో ఉండగా, జయశంకర్ భూపాలపల్లి 82.34 శాతం, కుమ్రం భీమం ఆసిఫాబాద్‌ జిల్లా 82.16 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా 58.69 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కేటగిరీలో కుమ్రం భీం జిల్లా 88.07శాతంతో టాప్ లో ఉండగా, జనగామ జిల్లా 63.97శాతంతో లాస్ట్ లో ఉంది. 

గ్రూపు    హాజరైంది     పాస్     పర్సంటేజీ (% )
ఎంపీసీ     2,19,679    1,65,880    75.51 
ఎంఈసీ     16,547    10,601    64.07 
బైపీసీ     1,01,907    73,770    72.39 
సీఈసీ     93,431     41,955    44.90 
హెచ్ఈసీ     10,039    3,447     34.34
ఇతరులు    261    127    48.66
మొత్తం    4,41,864    2,95,780    66.94 


 గ్రూపులవారీగా సెకండియర్‌ ఫలితాలు..

గ్రూపు    హాజరైంది    పాస్     పర్సంటేజీ  (% )
ఎంపీసీ     2,37,301    1,85,110    78.01 
ఎంఈసీ      15,464    10,502    67.91 
బైపీసీ     1,00,630    76,522    76.04 
సీఈసీ     1,00,567    49,674    49.39 
హెచ్​ఈసీ     7,955    3,918    49.25  
ఇతరాలు    403    301    74.69 
మొత్తం    4,62,320    3,26,027    70.52 


కోర్సులు     మార్కులు     స్టూడెంట్లు 
ఎంపీసీ     997      1 
బైపీసీ     997     2 
ఎంపీసీ     996     19 
బైపీసీ     996     3 
ఎంపీసీ     995     84 
బైపీసీ     995     31


ఇంటర్ ఉత్తీర్ణత వివరాలు.. (జనరల్ కేటగిరీ) 
ఇయర్       ఫస్టియర్(శాతం)     సెకండియర్(శాతం) 
2022     64.86      68.68
2023      62.85     67.27 
2024     61.08    69.49 
2025     66.91    71.43 
2026     66.94    75.61