గద్వాల, వెలుగు: దళిత యువకుడు బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో యువకుడితో పాటు అతడి బాబాయి ఇంటిని కూల్చేసిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. గద్వాల మండలం రేపల్లె గ్రామంలో గురువారం అమ్మాయి తరపు బంధువులు ఇండ్లను కూల్చేశారు. గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన ప్రభుదాసు కొడుకు రంగముని హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన తుమ్మలపల్లి వీరన్న కూతురు మహేశ్వరి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. హైదరాబాద్లో ఉంటున్న వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
బుధవారం వారు పెళ్లి చేసుకున్నారు. తామిద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని మాసబ్ ట్యాంక్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడి పోలీసులు అమ్మాయి తరపు బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రేమ పెళ్లి వద్దని అమ్మాయికి వారి బంధువులు నచ్చజెప్పినా ఆమె వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఊరికి తిరిగివచ్చిన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం తాళం వేసి ఉన్న అబ్బాయి ఇంటిని ట్రాక్టర్లతో ఢీకొట్టి, గడ్డపారలతో ధ్వంసం చేశారు.
పక్కనే ఉన్న అబ్బాయి బాబాయ్ రేకుల ఇంటిని సైతం కూల్చేశారు. అబ్బాయి తరపు వారు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ టంగుటూరి శీను తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు.
