
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల కోసం డిసెంబర్ నెలాఖరు వరకు 86 టీఎంసీలు వాడుకునేందుకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ సోమవారం ఇండెంట్ పంపారు. కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్‌కు 12 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీరు, ఏఎమ్మార్పీకి 32, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 42 టీఎంసీలు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు కృష్ణా బేసిన్‌లో తాము 86 టీఎంసీల నీరు ఉపయోగించుకున్నామని, ఇందులో నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కింద 53 టీఎంసీలు, కల్వకుర్తి, జూరాల, ఇతర లిఫ్టుల కింద 31, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు 6 టీఎంసీలు ఉపయోగించుకున్నామని తెలిపారు. ఏపీ ఇప్పటి వరకు 412 టీఎంసీలు తీసుకుందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 124 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 123 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 23 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడి కాలువకు 73 టీఎంసీలు, ఇతర ఔట్‌లెట్ల కింద 69 టీఎంసీలు తీసుకుందని వివరించారు.