Ashes 2025: ఇంగ్లాండ్ జట్టును తీసి పడేసిన ఆసీస్ దిగ్గజం.. యాషెస్ జోస్యం చెప్పిన మెగ్రాత్

Ashes 2025: ఇంగ్లాండ్ జట్టును తీసి పడేసిన ఆసీస్ దిగ్గజం.. యాషెస్ జోస్యం చెప్పిన మెగ్రాత్

క్రికెట్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ కు ఎక్కువ క్రేజ్ ఉందని భావిస్తారు. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్‌ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ వచ్చినప్పుడల్లా క్రికెట్‌ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. మూడు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ మెగా సిరీస్ పై బజ్ స్టార్ట్ అయింది. 

యాషెస్ 2025 సిరీస్ పై ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పి ఇంగ్లాండ్ కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పాడు. యాషెస్ లో ఆస్ట్రేలియా 5-0తో ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ దిగ్గజ పేసర్ అన్నాడు. బిబిసి రేడియోలో మెగ్రాత్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లాండ్ ఓడించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు. "స్వదేశంలో పాట్ కమ్మిన్స్ , మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లియాన్ లాంటి ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ కు అసాధ్యం. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ కు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈ సిరీస్ ఇంగ్లాండ్ గెలవడం కష్టమే. ఆస్ట్రేలియా 5-0 తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తుంది". అని మెగ్రాత్ అన్నాడు. 

►ALSO READ | Haider Ali: అత్యాచారం ఆరోపణలు.. ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ యువ క్రికెటర్ అరెస్టు

చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్‌ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.