హైదరాబాద్, వెలుగు: బంగారానికి సంబంధించిన అన్ని సేవలనూ ఒకే చోట అందించడానికి హైదరాబాద్లో గ్లోబల్ గోల్డ్ సిటీని ప్రారంభిస్తామని గోల్డ్ సిక్కా లిమిటెడ్ ప్రకటించింది. సాధారణంగా బంగారు రంగం మైనింగ్, రిఫైనింగ్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాలుగా విడిపోయి ఉంటుంది.
గ్లోబల్ గోల్డ్ సిటీ గనుల నుంచి మార్కెట్ వరకు, భౌతిక రూపం నుంచి డిజిటల్ వరకు అన్ని ప్రక్రియలను ఒకే చోటకు చేరుస్తుంది. ఇందులో గోల్డ్ రిఫైనింగ్, వాల్టింగ్ (భద్రపరచడం), బులియన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.
గోల్డ్ ఏటీఎం ద్వారా భౌతిక బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చని ఎండీ సయ్యద్ తరుజ్ తెలిపారు. ఈ కంపెనీ గోల్డ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఇది నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుంది. దీని ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గోల్డ్ సిక్కా తెలిపింది.
