హైదరాబాద్, వెలుగు: జీఎంఆర్ ఏరో టెక్నిక్ (జీఏటీ), బోయింగ్ డిఫెన్స్ ఇండియా (బీడీఐపీఎల్) మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. పీ-8ఐ సముద్ర గస్తీ విమానాల ఫేజ్-56 హెవీ మెయింటెనెన్స్ పనుల కోసం ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ సెజ్ లోని జీఏటీ కేంద్రంలో విమానాల స్ట్రక్చరల్ అప్‌గ్రేడ్లు, తనిఖీలు, పెయింటింగ్, సిస్టమ్ అప్‌గ్రేడ్లు వంటి పనులు నిర్వహిస్తారు.
భారతదేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) హబ్‌గా మార్చాలనే లక్ష్యానికి ఈ ఒప్పందం బలం చేకూరుస్తుంది. జీఏటీ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ బోయింగ్ సంస్థతో ఉన్న అనుబంధాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
రక్షణ రంగ విమానాల నిర్వహణలో తమ నైపుణ్యానికి ఇది గుర్తింపు అని చెప్పారు. బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఎండీ నిఖిల్ జోషి మాట్లాడుతూ భారత్‌లో ఎంఆర్ఓ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. భారత నావికాదళం ప్రస్తుతం డజను పీ-8ఐ విమానాలను ఉపయోగిస్తోంది. దేశ సముద్ర భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
