
హైదరాబాద్, వెలుగు: జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ), అంతర్జాతీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ కార్గో సరుకుల రవాణాకు కొత్త ఫెసిలిటీని ప్రారంభించినట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఇదివరకే ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్ ఉంది. సరుకుల నిర్వహణకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆమోదిత ప్రత్యేకమైన అంతర్జాతీయ కొరియర్ ఫెసిలిటీ కావాలని గుర్తించి దీనిని ఏర్పాటు చేశామని జీహెచ్ఏసీ ప్రకటించింది. ఫెసిలిటీ ప్రారంభ కార్యక్రమంలో కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బివి శివ నాగ కుమారి, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్- ఎస్‌జికె కిషోర్, సీఈఓ ప్రదీప్ పణికర్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఏసీ టెర్మినల్ సమీపంలోని ఈ ఫెసిలిటీ కొరియర్, కార్గో షిప్‌మెంట్ల ఎగుమతులకు, దిగుమతులకు కీలకంగా మారుతుంది. ఇది ఇండియన్ కస్టమ్స్ ఎక్స్‌ప్రెస్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ తో లింక్ అయి ఉంటుంది. దీని వల్ల టెర్మినల్ వద్ద కొరియర్ కన్సైన్మెంట్ ప్రాసెసింగ్, క్లియరెన్స్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా, తొందరగా జరుగుతుంది.