కాంగ్రెస్ అధిష్టానానికి గులాం నబీ ఆజాద్ షాక్

కాంగ్రెస్ అధిష్టానానికి గులాం నబీ ఆజాద్  షాక్

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాకిచ్చారు. జమ్ముకశ్మీర్ పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి రాజీనామా చేశారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ 23 గ్రూప్ లో ఆజాద్ ప్రముఖుడు. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల కమిటీలో ఉన్న ఆజాద్ ను జమ్ముకశ్మీర్ కు పరిమితం చేయడం తన హోదా తగ్గించినట్టు అవుతుందని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఆజాద్ కు సన్నిహితుడు అహ్మద్ మీర్ జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జమ్ము అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఎన్నికలు, ప్రచారం సహా ఇతర కమిటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు.జమ్ముకశ్మీర్ పీసీసీ చీఫ్ గా వికార్ వసూల్ వనీ ని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమణ్ భల్లాను నియమించారు. అయితే ఆజాద్ ను ప్రచార కమిటీ చీఫ్ గా నియమించగా... ఆ బాధ్యతలను తప్పుకున్నారు. గతంలో ఆజాద్ జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను నిర్వర్తించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా గులాం నబీ ఆజాద్ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఓటర్ల జాబితా ఖరారు, డీలిమిటేషన్ కసరత్తు పూర్తయిన తర్వాత జమ్మ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే శీతాకాలం ముగిసేలోపు డీలిమిటేషన్, ఓటర్ల జాబితా సవరణ పూర్తి కానందున ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించలేమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల సంఘం ఇటీవల ఓటర్ల జాబితా తుది ప్రచురణ తేదీని నవంబర్ 25కి సవరించింది.