రెండు రిజర్వాయర్ల రక్షణకు హైపవర్‌‌ కమిటీ

రెండు రిజర్వాయర్ల రక్షణకు హైపవర్‌‌ కమిటీ
  • ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుపై నిర్ణయం తీసుకునేదాకా ఆంక్షలుంటాయని కౌంటర్

హైదరాబాద్ : ఉస్మాన్‌‌సాగర్, హిమాయత్‌‌సాగర్‌‌ రిజర్వాయర్ల రక్షణకు 111 జీవో నిబంధనలన్నీ అమల్లో ఉన్నాయని రాష్ట్ర సర్కార్‌‌ హైకోర్టుకు చెప్పింది. 69 జీవోను ఈ ఏడాది ఏప్రిల్‌‌ 21న జారీ చేసినప్పటికీ 1996లో ఇచ్చిన 111 జీవోలోని ఆంక్షలన్నీ అమల్లోనే ఉన్నాయని తెలిపింది. కొత్త జీవో ప్రకారం రాష్ట్ర చీఫ్‌‌ సెక్రటరీ ఇతర శాఖల స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీలతో హైపవర్‌‌ కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ రిపోర్టు ఇవ్వడం, దానిని ప్రభుత్వం అమలు చేసే వరకు జీవో 111లోని ఆంక్షలు, నిషేధాలు అమల్లో ఉంటాయని మున్సిపల్‌‌ శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ అరవింద్‌‌కుమార్‌‌ తెలిపారు. జీవో 111 సరిగ్గా అమలు చేయడం లేదని పర్యావరణవేత్త జీవానంద్‌‌రెడ్డి పిల్​ దాఖలు చేయగా దానిపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసింది. 

సీఎస్‌ అధ్యక్షతన కమిటీలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా శాఖల స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రటరీ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సివరేజ్‌ బోర్డు ఎండీ, స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు.రెండు రిజర్వాయర్ల నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, కలుషిత నీరు రిజర్వాయర్లల్లోకి చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు. కొత్త లేఔట్లకు ఏవిధంగా పర్మిషన్స్‌ ఇవ్వాలి. కొత్త నిర్మాణాలకు ఏవిధమైన గైడ్‌లైన్స్‌ అమలు చేయాలి. వ్యర్థ పదార్థాలు, మురుగునీరు రిజర్వాయర్లలో చేరకుండా చర్యలు. దీని కోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు. గ్రీన్‌ ఓన్స్‌ ఏర్పాటు. సివరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటు. పరిసర ప్రాంతాల్లో అమలు చేయాల్సిన నిబంధనలు... తదితర అంశాలపై కమిటీ స్టడీ చేసి రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు వచ్చే వరకే కాకుండా దానిని ప్రభుత్వం అమలు చేయాలనే నిర్ణయం తీసుకునే వరకు జీవో 111 అమల్లోనే ఉంటుంది.

రిజర్వాయర్ల రక్షణకు, నీరు కలుషితం కాకుండా ఉండేందుకు వాటికి సమీపంలోని 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు, నిషేధాలు విధిస్తూ 1996లో వెలువడిన జీవో 111 అమల్లోనే ఉంటుంది. రెండు రిజర్వాయర్ల నీటిని హైదరాబాద్‌లోని 27.59 శాతం ప్రజలకు తాగు నీరు అందేది. అప్పుడు 145 ఎంజీడీ నీటి వినియోగం జరిగేది. ఇప్పుడు నీటి అవసరం 602 ఎంజీడీలకు పెరిగింది. 344 ఎంజీడీల నీరు అవసరం ఉంది. ఇప్పుడు ఆ రిజర్వాయర్ల నీరు 1.20 శాతం హైదరాబాద్‌ నగర ప్రజలకు అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వాయర్ల క్యాచ్‌మెంట్‌ ఏరియాలను, రిజర్వాయర్ల నీటిని కాపాడేందుకు వీలుగా కమిటీ రిపోర్టు ఇస్తుంది. అప్పటి వరకు పాత జీవో 111 అమల్లోనే ఉంటుంది. కాబట్టి పిల్స్‌ను డిస్మిస్‌ చేయాలి.. అని అరవింద్‌ కుమార్‌ హైకోర్టును కోరారు. దీన్ని బుధవారం హైకోర్టు విచారణ చేయనుంది.