IPL 2026: పరుగుల కోసం కష్టపడిన లక్నో.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్!

IPL 2026: పరుగుల కోసం కష్టపడిన లక్నో.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధమైంది. ల‌క్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆలౌట్ అయింది. 18. 4 ఓవర్లలోనే 141 పరుగులు చేసి  చాప చుట్టేశారు. అంతకుముందు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రిషబ్ పంత్ (7), ఐడెన్ మార్క్రమ్ (5), ఆయూష్ బదోనీ (0) కేవలం 49 పరుగులకే ఆ జట్టు కీలకమైన ముగ్గురు బ్యాటర్లు అవుట్ అయి తీవ్ర కష్టాల్లో పడింది.

మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం ఒక్కడే కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, మరో ఎండ్ లో చెలరేగాడు. 28 బంతుల్లో2 ఫోర్లు 3 సిక్సులతో 35 పరుగులు చేసిన తర్వాత మార్ష్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (8) వచ్చి రాగానే ఒక ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించినప్పటికీ లుంగి ఎంగిడి బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన అబ్దుల్ సమద్ కాసేపు ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సుతో 36 పరుగులు చేసిన తర్వాత టీ. నటరాజన్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు.

ఇక ముకల్ చౌదరీ కూడా 14 పరుగులు చేసిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన  మహ్మద్ షమీ (1),  అన్రిచ్ నోర్ట్జే (0), మోహసిన్ ఖాన్ (0) విఫలం కావడంతో కేవలం 141 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఆలౌట్ అయింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షహబాజ్ అహ్మద్ (15) నాటౌట్ గా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, టీ. నటరాజన్ తలో మూడు వికెట్లు తీసుకుని లక్నో పతనాన్ని శాసించగా.. కుల్దీప్ రెండు వికెట్ల పడగొట్టగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.