హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే..

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే..

వారిది ఒకే జిల్లా కాదు.. ఒకే రాష్ట్రం కాదు.. వేర్వేరు ప్రాంతాలైనప్పటికీ.. సోషల్ మీడియా పరిచయంతో మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వివాహం జరిగి సరిగ్గా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. అంతలోనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన నవవధువు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 2026, ఏప్రిల్ 1వ తేదీన  హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే.. 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్ బన్సల్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 20, 2026న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు.  మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.  

ఇటీవల అదనపు కట్నం  కోసం భర్త నీరాజ్ బన్సల్ నుంచి వేధింపులకు గురి చేస్తుండటంతో  తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.ఈ వేధింపులు తట్టుకోలేక ఇషిక తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.  సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు పోలీసులు. 

ఇటీవల సోషల్ మీడియా పరిచయాలతో ప్రేమలు పెరిగాయని.. అవి పెళ్లి వరకు వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు.  కానీ ఇలాంటి వివాహాలలో ఎక్కువగా క్రైమ్ జరుగుతుందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.