
మొన్నటిదాకా అల్లర్లు, హిందూ ఆలయాలపై దాడులతో అట్టుడుకిన దాయాది బంగ్లాదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురవ్వటం కలకలం రేపింది. గురువారం ( అక్టోబర్ 10, 2024 ) మధ్యాహ్నం సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకులు పూజలు ముగించుకొని వెళ్ళాక క్లీనింగ్ కోసం వెళ్లిన సిబ్బంది అమ్మవారి కిరీటం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జెషోరేశ్వరి ఆలయం భారత్ సహా పొరుగు దేశాలలో విస్తరించి ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి కావటంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి కిరీటం చోరీకి గురికావటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Glimpses from the memorable visit to the Jeshoreshwari Kali Temple. pic.twitter.com/tOHxdrMsWX
— Narendra Modi (@narendramodi) March 27, 2021
ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 2021 మార్చిలో జెషోరేశ్వరి ఆలయానికి కిరీటాన్ని బహూకరించారు. అతను సింబాలిక్ సిగ్నేచర్ గా అమ్మవారి శిరస్సుపై కిరీటాన్ని ఉంచాడు. బంగ్లాదేశ్ లోని సత్ఖిరాలోని ఈశ్వరీపూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో
ఓ బ్రాహ్మణుడు జశోరేశ్వరీ పీఠం కోసం 100 తలుపులతో నిర్మించినట్లు సమాచారం.