
ఒకరు టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరు బాలీవుడ్ క్రేజీ స్టార్.. ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తుంటే చూడటానికి ఎలా ఉంటుంది! విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. అటువంటి ఫీస్ట్‌ని నిన్న అభిమానులకు అందించింది ‘గాడ్‌ఫాదర్’ టీమ్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులు కూడా వేశాడు. ఈ పాటను నిన్న విడుదల చేశారు.
జోష్‌ఫుల్‌గా సాగిన తమన్ ట్యూన్, యువతను అట్రాక్ట్ చేసేలా ఉన్న అనంత శ్రీరామ్ లిరిక్స్, తనదైన స్టైల్లో పాటను ప్రెజెంట్ చేసిన శ్రేయా ఘోషల్ సింగింగ్ స్టైల్ ఇవన్నీ ఒకెత్తయితే.. చిరంజీవి, సల్మాన్‌ల డ్యాన్స్ మరొకెత్తు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేసి ఊపు తెప్పించారిద్దరూ. ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేయడంతో మూమెంట్స్ ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకున్నాయి. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.