వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ రంగంలోకి.. గోద్రెజ్ ఇండస్ట్రీస్

వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ రంగంలోకి.. గోద్రెజ్ ఇండస్ట్రీస్
  • గోద్రెజ్ నుంచి​ వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ సేవలు

న్యూఢిల్లీ: వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇందులో భాగంగా గోద్రెజ్ వెల్త్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాట్‌‌‌‌ఫామ్ 2031 నాటికి రూ. లక్ష కోట్ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌‌‌‌ఫామ్  సంపన్నులు, గరిష్ట నికర విలువ గల వ్యక్తుల (హెచ్ఎన్ఐలు) పై దృష్టి పెడుతుంది. రాబోయే ఐదేళ్లలో 35 ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. గోద్రెజ్ వెల్త్ సంస్థ గోద్రెజ్ క్యాపిటల్‌‌‌‌తో కలిసి ఆర్థిక సేవల విభాగంలో భాగం కానుంది. 

ఈ వ్యాపారం ప్రధానంగా రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తలు, వ్యాపార కుటుంబాలు, ప్రవాస భారతీయులు (ఎన్‌‌‌‌ఆర్ఐలు), అధునాతన పెట్టుబడిదారులకు సేవలను అందిస్తుంది. ఇది వారసత్వ ప్రణాళిక, ప్రైవేట్ మార్కెట్ యాక్సెస్, గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అవకాశాలు, పోర్ట్‌‌‌‌ఫోలియో నిర్మాణ సేవలను అందిస్తుంది. భారతదేశంలో సంపద పెరుగుతున్న తరుణంలో తరాల తరబడి దీర్ఘకాలిక నిర్వహణను అందించగల సంస్థల అవసరం ఉందని గోద్రెజ్ గ్రూప్ చైర్‌‌‌‌పర్సన్ (డిసిగ్నేట్) పిరోజ్​షా గోద్రెజ్ పేర్కొన్నారు.