వాయిదా స్కీముల్లో నగలు కొంటే కాస్త రిస్కే!

వాయిదా స్కీముల్లో నగలు కొంటే కాస్త రిస్కే!

వెలుగు బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌ : బంగారం స్కీములు నడిపే ముంబై కంపెనీ గుడ్‌‌‌‌విన్ జ్యూయలర్స్‌‌‌‌ ఇటీవలే షట్టర్లు దించేసింది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. డిపాజిటర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో గుడ్‌‌‌‌విన్ జ్యూయలర్స్‌‌‌‌ విఫలమైంది. ఇదే విధంగా గతంలో బెంగళూరు కంపెనీ ఐఎంఏ జ్యూయలర్స్‌‌‌‌ చేతిలోనూ, చెన్నైలోని నాదెళ్ల సంపత్తు చెట్టి, రూబీ జ్యూయలరీ చేతిలోనూ చిన్న ఇన్వెస్టర్లు మోసపోయారు. ఇటీవలే కేరళలోని తుంచత్‌‌‌‌ జ్యూయలర్స్‌‌‌‌, అవతార్‌‌‌‌ జ్యూయలర్స్‌‌‌‌లూ బోర్డు తిప్పేశాయి.

దివాలా తీస్తే పరిస్థితి ఏమిటి ?

గోల్డ్‌‌‌‌ స్కీములు నడిపే జ్యూయలరీ సంస్థలు దివాలా తీసినా లేదా మోసం చేసినా ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి ? ఇలాంటి సందర్భాలలో నిజానికి ఇన్వెస్టర్లను పరిరక్షించడానికి ఎలాంటి రూల్స్‌‌‌‌ ప్రస్తుతం లేవు. కంపెనీలు లిక్విడేషన్‌‌‌‌ (మూసివేత) సందర్భంలోనూ ఇలాంటి ఇన్వెస్టర్లకు ఏమీ దక్కదు. సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు రూ. లక్ష లోపే ఇలాంటి స్కీములలో పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి పెట్టుబడులు ఇన్‌‌‌‌సాల్వెన్సీ బ్యాంక్‌‌‌‌రప్టసీ కోడ్‌‌‌‌ (ఐబీసీ) కిందకి రావు. అలాంటి పెట్టుబడులను అన్‌‌‌‌సెక్యూర్డ్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ (హామీలేని అప్పు)గానే పరిగణిస్తారు, కాదంటే ట్రేడ్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌గా పరిగణిస్తారని కార్పొరేట్‌‌‌‌ ఎఫైర్స్‌‌‌‌ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

తక్కువ గోల్డ్‌‌‌‌ స్కీములే చట్టబద్దమైనవి……

ఏదైనా స్కీములో డిపాజిట్లు రూ. 100 కోట్లను మించితే, అది కలెక్టివ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కీము అవుతుందని సెక్యూరిటీస్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (సెబీ) గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ చెబుతున్నాయి. అలాంటి స్కీములకు సెబీ అనుమతి తప్పనిసరి. కానీ, చాలా కంపెనీలు అసలు ఆ అనుమతే తీసుకోవు. దేశంలో నడిచే కొన్ని గోల్డ్‌‌‌‌ స్కీములు మాత్రమే చట్టబద్దమైనవి. ఈ విషయం చాలా మంది  ఇన్వెస్టర్లకు తెలీదు. స్కీము ఆఫర్‌‌‌‌ చేసే సంస్థ పార్ట్‌‌‌‌నర్షిప్పా, ప్రొప్రైటర్‌‌‌‌షిప్పా లేక పబ్లిక్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీనా, ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీనా అనేది తప్పకుండా ఇన్వెస్టర్లు తెలుసుకుని తీరాలి. ఏదైనా పబ్లిక్‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌   కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవచ్చు. అలా డిపాజిట్లు తీసుకోవడానికి 2013 కంపెనీల చట్టం వాటిని అనుమతిస్తోంది. ఐతే, ఇలా తీసుకునే డిపాజిట్లపై ప్రతిఫలం (వడ్డీ) 12.5 శాతానికి మించకూడదని చట్టం నిర్దేశిస్తోంది. అంతేకాదు, అలాంటి కంపెనీలు తమ నెట్‌‌‌‌వర్త్‌‌‌‌లో 25 శాతానికి మించి డిపాజిట్లు సేకరించకూడదని న్యాయ నిపుణుడు ఒకరు తెలిపారు.

 గోల్డ్‌‌‌‌ స్కీములు ఎన్నో..

వీధి చివర ఉండే కంసాలి నుంచి కార్పొరేట్‌‌‌‌ చెయిన్ తనిష్క్‌‌‌‌ దాకా ఎంతో మంది గోల్డ్‌‌‌‌ స్కీములు ఆఫర్‌‌‌‌ చేస్తున్నారు. తనిష్క్‌‌‌‌ నడిపే గోల్డెన్‌‌‌‌ హార్వెస్ట్‌‌‌‌ స్కీములో 2018–19 నాటికి జనం ఏకంగా రూ. 1,273 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అంతకు ముందు ఏడాదిలో ఈ డిపాజిట్లు రూ. 1,041 కోట్లు. ఇక మరో అన్‌‌‌‌లిస్టెడ్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కంపెనీ కళ్యాణ్‌‌‌‌ జ్యూయలర్స్‌‌‌‌ కూడా గత మూడు దశాబ్దాలుగా గోల్డ్‌‌‌‌ స్కీములను నడుపుతోంది.

రెగ్యులేషన్స్‌‌‌‌ పాటించాల్సిందే….

రెగ్యులేటరీపరంగా వచ్చే మార్పులను కంపెనీలు ఎప్పటికప్పుడు అనుసరించడం తప్పనిసరి. సవరించిన కంపెనీల చట్టం ఏప్రిల్‌‌‌‌ 1, 2014 నుంచి అమలులోకి వచ్చింది. వెంటనే తమ కస్టమర్లను వారి స్కీములను క్లోజ్‌‌‌‌ చేసి, డబ్బు రిఫండ్‌‌‌‌ తీసుకోవల్సిందిగా కోరామని కళ్యాణ్‌‌‌‌ జ్యూయలర్స్‌‌‌‌ సీఎండీ టీ ఎస్‌‌‌‌ కళ్యాణరామన్‌‌‌‌ చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లపాటు ఎలాంటి రిటర్న్స్‌‌‌‌ ఇవ్వని ఒక స్కీమును మాత్రమే అందించాం. అప్పుడు  కంపెనీని పబ్లిక్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌గా జూన్‌‌‌‌ 15, 2016లో  మార్చాం. కొత్త కంపెనీల చట్టానికి అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌‌‌‌ను అప్పుడు మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు. స్కీము కాల పరిమితి, రిటర్న్స్‌‌‌‌ అంశాలలో నిబంధనలకు అనుగుణంగానే ఈ స్కీమును రూపొందించినట్లు చెప్పారు.

రూల్స్‌‌ తెలుసుకుంటే మేలు….

కంపెనీల చట్టంలోని రూల్‌‌ 2 కింద కొన్ని ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలూ డిపాజిట్లు తీసుకుంటున్నాయి. కొన్ని పేరొందిన జ్యూయలరీ సంస్థలు ప్రైవేట్‌‌ ఫర్మ్స్‌‌గానే రిజిస్ట్రేషన్ పొందినా దశాబ్దాల తరబడి విశ్వసనీయమైన గోల్డ్‌‌ స్కీములను నడుపుతున్నాయి.  ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలు డిపాజిట్లు తీసుకోవడానికి రూల్స్‌‌ ఒప్పుకోవు. కానీ, వస్తువులు అమ్మకానికి అడ్వాన్స్‌‌లు కింద డబ్బు తీసుకోవడానికి రూల్స్‌‌ ఒప్పుకుంటాయి. ఇలాంటి సందర్భాలలో,  ఏడాదిలోపల వస్తువులైనా ఇవ్వాల్సి ఉంటుంది లేదా డబ్బైనా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని మరో నిపుణుడు చెప్పారు. ఇంకా మరి కొన్ని సంస్థలుంటాయి. అవి అసలు పబ్లిక్‌‌ లేదా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలుగా రిజిస్ట్రేషన్‌‌నే పొందవు. ఇలాంటి సంస్థలు నడిపే స్కీములకు చట్టంలో తగిన రూల్స్‌‌ లేవని ఆ నిపుణుడు వ్యాఖ్యానించారు.