కొత్త చట్టం: గోల్డ్ స్కీమ్ ఆఫర్లు గోవిందా..

కొత్త చట్టం: గోల్డ్ స్కీమ్ ఆఫర్లు గోవిందా..

స్కీమ్ ల రూపంలో కస్టమర్లను ఆకట్టుకుంటూ పోటీ పడుతున్న జ్యువెల్లరీలకు గట్టి షాక్ తగలనుంది. గోల్డ్ స్కీమ్ లలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం గోల్డ్ స్కీములపై అన్‌ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్ 2019 తెచ్చింది. చట్టం ప్రకారం.. బంగారం వ్యాపారులు గోల్డ్ స్కీముల్లో ఏడాదికి మించి డబ్బులు వసూలు చేయకూడదు. సరిగ్గా 365 రోజులు అవ్వగానే కస్టమర్లకు గోల్డ్ ను ఇచ్చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా రిగినా నేరం కిందకే వస్తుంది. ఈ చట్టం ప్రకారం జ్యువెలరీ షాపుల యాజమాన్యాలు ఒక నెల ఉచిత వాయిదా, ఇతరత్రా ఫ్రీ ఆఫర్లు ఇవ్వడానికి వీల్లేదు. అలాంటి వాటిని నేరం కిందే పరిగణిస్తోంది ఈ చట్టం.

కస్టమర్లు భవిష్యత్తులో కొనబోయే వస్తువుకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తున్నారని వ్యాపారులు చెప్పినా… అందుకు పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైనా గోల్డ్ స్కీంలో చేరితే, 12 నెలలు మాత్రమే స్కీం ఉండాలి. 12 నెలలూ కస్టమర్లే డబ్బు చెల్లించాలి. ఈ విషయంలో జ్యువెలరీ సంస్థ ఒక నెల వాయిదా ఫ్రీ వంటి ఎలాంటి ఆఫర్లూ ప్రకటించకూడదు. 12వ నెలలో 365 రోజులు ముగియగానే… బంగారాన్ని వెంటనే కస్టమర్లకు ఇచ్చేయాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా నేరంగానే పరిగణిస్తుంది కొత్త చట్టం.

ఇటీవల గోల్డ్ స్కీంలు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. జ్యువెలరీ షాపులు… తొలి వాయిదా తాము చెల్లిస్తామనో, అదనపు ఖర్చులు ఉండవనో ఏదో ఒకరకంగా ఆకర్షిస్తూ… గోల్డ్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇది కొంతవరకూ మంచిదే. చేతిలో బంగారం ఉంటే… సడెన్‌ గా మనీ అవసరమైనప్పుడు దాన్ని డిపాజిట్ చేసి డబ్బు తీసుకోవచ్చంటున్నారు.