ఆరోగ్యానికి ఆకుకూరలు

ఆరోగ్యానికి ఆకుకూరలు

రోజువారీ ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటితో ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చగా ఉండే ఆకుకూరలను భోజనంలో భాగంగా తీసుకునే వాళ్లకి ఇతరులతో పోలిస్తే మంచి పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు. ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలతో పాటు కంటి చూపునకు అవసరమైన విటమిన్లు కూడా అందుతాయి. అందుకే ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకునే వాళ్లకి మంచి కంటి చూపు లభిస్తుంది.  అలాగే శరీరంలో ఏర్పడే రక్తహీనత నుంచి కాపాడుకోవడానికి కూడా ఆకుకూరలు ఉపయోగపడుతాయి. వీటిలో ఉండే ఇనుము వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.

ప్రస్తుత కాలంలో ఫాస్ట్‌ ఫుడ్ సంస్కృతి పెరిగిపోవడంతో మనుషులను వివిధ రకాల సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే వీటికి కారణం. పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రారంభిస్తే దాదాపు చాలా రోగాలను అదుపులో పెట్టుకోవచ్చు. ఒక్కోరకమైన ఆకుకూరలో ఒక్కోరకమైన విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.