విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే TGSRTC గుడ్ న్యూస్‌

విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే TGSRTC గుడ్ న్యూస్‌

హైదరాబాద్: విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) గుడ్ న్యూస్‌ చెప్పింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో ప్రత్యేక రాయితీల‌ను ప్రకటిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జరీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 19) ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించింది. టీజీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించారు. విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

 తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన గొల్లగట్టు జాతర సూర్యాపేటలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు వెళ్లే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ నెల 26న శివరాత్రి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‎లో ఉండే వారు సొంతూర్లు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆర్టీకి లాభం రానుంది. భారీగా పెరిగి బస్ టికెట్ ధరలతో అల్లాడిపోతున్న ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ డిస్కౌంట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.