రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమస్యల పరిష్కారానికి కొత్త పోర్టల్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమస్యల పరిష్కారానికి కొత్త పోర్టల్
  • సమస్యల పరిష్కారానికి రైల్వే శాఖ కొత్త పోర్టల్
  • ప్రయాణికులతోపాటు ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం  
  • కాల్పుల్లో చనిపోయిన వారికి రైల్వే ఎలాంటి పరిహారం ఇవ్వదు
  • విధ్వంసం వల్ల ప్రత్యక్షంగా 12కోట్ల నష్టం.. 
  • ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాం
  • ఇప్పుడంతా సాధారణ పరిస్థితి ఉంది
  • రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా

సికింద్రాబాద్: రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది. రైల్వే సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే శాఖను, సేవలను మరింత సమర్ధవంతంగా నాణ్యతతో సేవలు అందించేందుకు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని రైల్వే శాఖ డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. ఇవాళ మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రైల్వేలను మరింత మెరుగు పరచడం కోసం కొత్త పోర్టల్ తీసుకొచ్చామన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రయాణికుల ఇబ్బందులు, ట్రాక్, రైల్వే ఇంజిన్లు, కోచ్ లకు సంబంధించిన సమస్యలకు కొత్త పోర్టల్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. కేవలం ప్రయాణికుల సమస్యలే కాదు.. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలకు కూడా ఈ పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. 

కాల్పుల్లో చనిపోయిన వారికి రైల్వే ఎలాంటి పరిహారం ఇవ్వదు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన  విధ్వంసాన్ని నిలువరిచే సమయంలో జరిగిన కాల్పుల్లో చనిపోయిన వారికి రైల్వేశాఖ ఎలాంటి పరిహారం ఇవ్వదని, అయితే కొన్ని రైళ్లు రద్దు చేయడం వల్ల ఇబ్బందిపడిన  ప్రయాణికులకు రీఫండ్ చెల్లించామని రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు వేసిన అంచనా మేరకు ప్రత్యక్షంగా 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లగా.. పరోక్షంగా జరిగిన నష్టం అపారం అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోందని.. నిన్నటి భారత్ బంద్ వల్ల ఎలాంటి సంఘటనలు జరగలేదని.. ఇప్పుడంతా సాధారణ పరిస్థితి కొనసాగుతోందని ఆయన వివరించారు. 

ప్రయాణికులకు రీఫండ్ చేశాం

అల్లర్లు ప్రభావంతో చాలా రైళ్లు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఇబ్బందిపడిన ప్రయాణికులకు రీ ఫండ్ చెల్లించామన్నారు. అల్లర్ల వల్ల ప్లాట్ ఫార్మ్ 2, 3, 4, 5 మీద ఉన్న కామర్శియల్ స్టాల్స్ అన్ని నాశనం అయ్యాయని తెలిపారు. నాలుగు బోగీలు కాలిపోయాయని, సిసిటీవీ కెమెరాలు, ఫాన్లు, స్టాల్స్ పూర్తిగా నాశనం అయ్యాయన్నారు. విధ్వంసాన్ని నిలువరించే సమయంలో.. జరిగిన కాల్పుల్లో చనిపోయిన వారికి రైల్వే శాఖ ఎలాంటి పరిహారం ఇవ్వదని రైల్వే డీవీఎం ఏకే గుప్తా స్పష్టం చేశారు. ఇప్పుడు అంత సాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు. విధ్వంసాన్ని నిలువరించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఎనిమిది మంది  రైల్వే ఉద్యోగులకు గాయాలయ్యాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  భద్రత కట్టుదిట్టం చేశామని.. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే వారికి.. స్టేషన్ నుంచి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.