- త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు
- 4 నెలల్లో 77 కోట్ల మంది మహిళల ప్రయాణం
- మహాలక్ష్మి పథకం ద్వారా సాకారం: ఎండీ సజ్జనార్
- బస్ భవన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి..- మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేస్తోందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ పేర్కొన్నారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 77 కోట్ల మందికి పైగా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. గురువారం బస్ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితోనే తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు.
త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు
పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోందని సజ్జనార్ చెప్పారు. త్వరలో కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు వాటిని నడిపేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను సంస్థ అమలు చేస్తోందన్నారు. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన ఫైలట్ ప్రాజెక్ట్ దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో అమలవుతోందన్నారు. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టం,అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను సంస్థ అమలు చేయాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. రాబోయే రోజులు సంస్థకు ఎంతో కీలకమని, శ్రావణమాసం, రాఖీ పండుగ, ముహుర్తాలు ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.
విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 30 మంది ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి సజ్జనార్ ప్రశంసాపత్రాలను అందజేశారు. పదేండ్లలో 70 వేలకుపైగా మొక్కలు నాటిన కరీంనగర్ జోనల్ వర్క్ షాప్ స్టోర్ అటెండెంట్ బి.సత్యనారయణను సన్మానించారు. వేడుకల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు మునిశేఖర్, కృష్ణకాంత్, మెడికల్ అడ్వైజర్ సైది రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ఫ, సీఎంఈ వెంకన్న, సీటీఎం ఉషాదేవి, సీసీవోఎస్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
