
- ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి సమస్య
- నిలిచిన జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు నిలిచి పోయాయి. సోమవారం మధ్యాహ్నం (ఇండియా టైమ్) 2:20 ప్రాంతంలో జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో వివిధ దేశాల్లోని వేలాది మంది ఇబ్బంది పడ్డారు. జీ మెయిల్ లో మెయిల్స్ లోడ్ కాలేదని, గూగుల్ డ్రైవ్లో డాక్యుమెంట్స్ ఓపెన్ చేయలేక పోయామని కస్టమర్లు కంపెనీకి ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ కూడా ఓపెన్ కాలేదని మరికొంతమంది ఆరోపించారు. ఈమేరకు ‘డౌన్ డిటెక్టర్’ వెబ్ సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్ ఇతర సర్వీసులపైనా ప్రభావం కనిపించిందని పేర్కొంది.
మెయిల్స్, డ్రైవ్, యూట్యూబ్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా ‘గేట్ వే టైంఔట్’ అంటూ ఎర్రర్ చూపించిందని తెలిపింది. గూగుల్ సేవలు నిలిచి చాలామంది వినియోగదారులు ఇబ్బంది పడగా.. మరికొంతమంది మాత్రం ఆన్ లైన్ లో దీనిపై ఫన్నీగా స్పందించారు. గూగుల్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడానికి తాను గూగుల్ చేసేందుకు ప్రయత్నించానని ఓ యూజర్ పోస్టు చేశాడు. ఇక, గూగుల్ ఇతర సర్వీసులలోనూ అంతరాయం ఎదుర్కొన్నట్లు మరికొంతమంది నెటిజన్లు చెప్పారు. గూగుల్ మీట్ లో జరుగుతున్న సమావేశం నుంచి తాను హఠాత్తుగా కట్ అయ్యానని, మళ్లీ సైన్ ఇన్ అయ్యేందుకు ప్రయత్నించినా కుదరలేదని చెప్పాడు.