- 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌కు శిక్షణ
- కోటి మంది స్టూడెంట్లకు జనరేటివ్ ఏఐ సపోర్ట్
న్యూఢిల్లీ: ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి చెందడంపై గూగుల్ పూర్తి నమ్మకంగా ఉంది. భారీగా ఇన్వెస్ట్ చేస్తుండడమే కాకుండా, ఇక్కడి ప్రొఫెషనల్స్, స్టూడెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏఐ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా తెలిపింది. ఇండియా ఏఐ సామర్థ్యాలపై ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో15 బిలియన్ డాలర్ల (సుమారు 1.36 లక్షల కోట్ల) విలువైన ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ గిగావాట్ కెపాసిటీ గల కంప్యూట్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయన్నారు. “ఏఐ సెక్టార్‌లో ఇండియా దూసుకుపోతుందని నమ్ముతున్నాను. ఈ జర్నీలో భాగస్వాములం కావాలని అనుకుంటున్నాం. మన లైఫ్‌టైమ్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏఐ. ఇండియా వంటి దేశాలు ఏఐతో ఒక్కసారిగా దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది.
కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయి. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, క్లైమేట్ వంటి చాలా రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. ఇండియాలో ఏఐ ఆధారిత వాయిస్, విజువల్ సెర్చ్‌లు భారీగా పెరిగాయి”అని పిచాయ్ వివరించారు. గూగుల్ జెమిని యాప్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని, ఇండియాలో 10 భాషల్లో ఇది అందుబాటులో ఉందని అన్నారు.
గూగుల్ ట్రెయినింగ్ ..
కర్మ యోగి భారత్ అనే ఇనీషియేటివ్ కింద 2 కోట్ల మంది కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న ప్రొఫెషనల్స్‌కు, ప్రభుత్వ ఉద్యోగులకు, స్టూడెంట్లకు ఏఐ స్కిల్స్ నేర్పిస్తామని గూగుల్ ప్రకటించింది. అంతేకాకుండా 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా 1.1 కోట్ల మంది స్టూడెంట్లకు జనరేటివ్ ఏఐ సపోర్ట్ అందిస్తామని తెలిపింది. గ్లోబల్‌గా ఏఐ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర సైంటిఫిక్ మోడల్స్‌లో ఫలితాలు సాధించాలని చూస్తున్న రీసెర్చర్లకు సపోర్ట్ చేసేందుకు 30 మిలియన్ డాలర్లను కేటాయించింది.
గూగుల్ డీప్‌మైండ్ ద్వారా ఇండియాలో ఐఐటీ మద్రాస్, ప్రభుత్వంతో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనే ముందు ప్రధాని మోదీని పిచాయ్ కలిశారు. ఇండియాలో ఏఐ వర్క్ గురించి, ట్యాలెంటెడ్ స్టూడెంట్లు, ప్రొఫెషనల్స్‌తో గూగుల్ పని చేయడం గురించి మాట్లాడామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఎన్విడియాతో ఎల్ అండ్ టీ జోడి
లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ), ఏఐ చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియాతో కలిసి ఇండియాలో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. జాయింట్ వెంచర్ ద్వారా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేస్తామని పేర్కొంది. ఎల్ అండ్ టీ చెన్నై డేటాసెంటర్‌లో ఎన్విడియా జీపీయూ క్లస్టర్‌ను 30 మెగావాట్ సామర్థ్యానికి విస్తరించనుంది. ముంబైలో కొత్తగా నిర్మిస్తున్న 40 మెగావాట్స్ డేటా సెంటర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది.
డ్రోన్ల ద్వారా డెలివరీ సర్వీస్‌లు అందిస్తున్న డెలివరీ ప్లాట్‌ఫామ్ స్కై ఎయిర్ మొబిలిటీ, అరైవ్ ఏఐ, ఒటానమీతో కలిసి ఏఐ సమ్మిట్‌లో ప్రొడక్ట్‌ల డెలివరీని ప్రదర్శించింది. స్కై ఎయిర్ గత రెండు సంవత్సరాల్లో డ్రోన్ల ద్వారా 36 లక్షల డెలివరీలను పూర్తి చేసింది.
గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏఐను విస్తరించేందుకు 2030 నాటికి 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.55 లక్షల కోట్ల) పెట్టుబడి పెడతామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. గ్లోబల్ నార్త్ దేశాల్లో ఏఐ వినియోగం గ్లోబల్ సౌత్ కంటే రెండింతలు ఎక్కువగా ఉందని, ఈ అంతరాన్ని తగ్గించకపోతే ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడింది.
