కరడుగట్టిన దోపిడీ ముఠా అరెస్టు

కరడుగట్టిన దోపిడీ ముఠా అరెస్టు

సికింద్రాబాద్, వెలుగు: అర్ధరాత్రి డాగర్లు (ఒక రకమైన కత్తులు) చూపి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన ముఠాను గోపాలపురం పోలీసులతో కలిసి టాస్క్​ఫోర్స్ ​అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుంచి రెండు డాగర్లు, మూడు సెల్​ఫోన్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఫలక్​నుమా, ముస్తాఫానగర్​కు చెందిన మసూద్​ఉర్ ​రహ్మన్​(31) చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు  అలవాటు పడ్డాడు. చదువు మానేసి కొంతకాలం వెల్డర్​గా , తర్వాత క్యాబ్ డ్రైవర్​గా పనిచేశాడు. 

డ్రైవర్​గా వచ్చే జీతం వ్యసనాలకు సరిపోకపోవడంతో ఈజీ మనీకి  దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో నాచారం, మైలార్​ దేవపల్లి పోలీసుస్టేషన్​పరిధిలో  దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. ఈ నెల 19న ముషీరాబాద్​లోని తన బంధువుల ఇంటికి వచ్చిన మసూద్.. స్క్రాప్​ బిజినెస్ ​చేస్తున్న ఫజల్​ఉర్​రహ్మన్​ను​ కలిశాడు.  సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేద్దామని, అతడికి ప్లాన్​ వివరించాడు. అందులో భాగంగా డాగర్లను తీసుకుని రాత్రి 12.30 గంటల సమయంలో చాదర్​ఘట్​ వైపు వెళ్లారు. మలక్​పేట్​స్వాగత్​ బార్ ఎదురుగా పార్క్​ చేసి ఉన్న హోండా యాక్టీవాను దొంగిలించారు. 

ఈ నెల 20 తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లి, రైల్వేస్టేషన్​కు నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్​ఫోన్​ లాక్కునేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో డాగర్లతో చంపేస్తామంటూ బెదిరించి సెల్​ఫోన్​ లాక్కొని పారిపోయారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా వచ్చిన వారిని డాగర్లు చూపిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో..  బైక్ టైరుపై కాల్పులు జరపగా, ఫజల్​ కుడి కాలికి  తగిలింది. మరో రౌండ్ ​కాల్పులు జరిపినా  నిందితులు పారిపోయారు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి  24 గంటల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.