దయనీయ స్థితిలో రిటైర్డ్ పోలీస్ కుటుంబం...ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి 

దయనీయ స్థితిలో రిటైర్డ్ పోలీస్ కుటుంబం...ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి 

అతనో రిటైర్డ్ పోలీస్.. ఎస్సైగా పని చేసి రిటైర్ అయ్యాడు. మాములుగా ఈ హోదాలో రిటైర్ అయిన వ్యక్తి అంటే... మంచి ఇల్లు, పిల్లాపాపల పెళ్లిళ్లు చేసి... హ్యాపీగా శేషజీవితం గడుపుతుంటారు అనుకుంటాం. కానీ.. ఈ ఎస్సై విషయంలో అలా జరగలేదు. ఉద్యోగ విరమణ బకాయిలు రాక, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో దీన స్థితిలో మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై కుక్కలా మైసయ్య కథ ఇది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఖమ్మం జిల్లా పోలీస్ సాయుధ దళంలో ఏఆర్ ఎస్సైగా పని చేసి.. గత ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు కుక్కల మైసయ్య. రిటైర్ అయ్యి ఏడాది కావస్తున్నా రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మైసయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ప్రభుత్వం నుంచి మైసయ్య కు రూ. 50 నుంచి 60 లక్షల వరకు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత దిగజారింది. అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చేరారు మైసయ్య, అతని భార్య భాగ్యమ్మ.

మైసయ్య దంపతులను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. భాగ్యమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. మరో పక్క మైసయ్య ఆరోగ్యం విషమించడంతో గురువారం అర్థరాత్రి మృతి చెందాడు. మైసయ్య కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉండటంతో బిల్లులు చెల్లించి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం సభ్యులు.