వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ గురించి అవగాహన ఉన్న వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. ఇండియా అండర్-19 జట్టులో మనోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రీజులో దిగాడంటే మొదటి బంతి నుంచి బాదుడే. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు దబిడిదిబిడే. పవర్ హిట్టింగ్కు కేరాఫ్ అడ్రస్. బంతిని కొడితే బరి అవతల పడాల్సిందే. అలాంటి ఈ అటాకింగ్ బ్యాట్స్మెన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాడు. ఈ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా మనోడు బంతిని బాదితే.. ఆ బంతి పోయి వాటర్ పైప్కు బలంగా తగిలింది.
just sooryavanshi things 😅 pic.twitter.com/HtP8p5KjlQ
— Rajasthan Royals (@rajasthanroyals) February 19, 2026
సూర్య వంశీ కొట్టిన కొట్టుడుకి బంతి వాయు వేగంతో పోయి తగలడంతో దెబ్బకి వాటర్ పైప్ పగిలిపోయింది. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. సూర్యవంశీ మాత్రమే ఇలా చేయగలడని స్మైల్ ఎమోజీ పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ టీనేజర్ హిట్టింగ్ పవర్ చూసి నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఐపీఎల్ మ్యాచుల్లో ఈ రకంగా ఆడితే బంతి స్టేడియం అవతల పోయి పడటం ఖాయమని కామెంట్ చేశారు.
ALSO READ : సూపర్–8లో హై–వోల్టేజ్ మ్యాచ్లు..
ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఈ బుడ్డోడు ఊచ కోత కోసిన సంగతి గుర్తుండే ఉంటుంది. 14 ఏండ్లకే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచి.. తొలి బాల్‌కే సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రాజస్తాన్ రాయల్స్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (38 బాల్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) తన మూడో మ్యాచ్‌లోనే విశ్వరూపం చూపెట్టాడు.
వరల్డ్ క్లాస్ హిట్టర్‌ను తలపించేలా.. మేటి బౌలర్లంతా భయపడేలా.. డేరింగ్ బ్యాటింగ్‌తో, ఖతర్నాక్ షాట్లతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. పేసర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బాల్స్‌లోనే వంద అందుకొని టీ20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఐపీఎల్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్మురేపాడు. తన మొత్తం స్కోరులో ఫోర్లు, సిక్సర్లతోనే 94 రాబట్టిన ఈ బీహార్ బుడ్డోడు క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
మొన్నమొన్న జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా దుమ్ములేపిన సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ (175) ఈ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించడంతో హరారేలో జరిగిన ఫైనల్లో 100 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఇండియా చిత్తు చేసింది. 55 బాల్స్‌లోనే వంద మార్కు అందుకున్న వైభవ్ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో మరో ఘనత సాధించాడు.
