ముగ్గురు దొంగల అరెస్ట్.. 4 లక్షల నగలు స్వాధీనం

ముగ్గురు దొంగల అరెస్ట్.. 4 లక్షల నగలు స్వాధీనం

సికింద్రాబాద్,వెలుగు: బస్సులో ప్యాసింజర్లే టార్గెట్​గా నగలు, డబ్బు చోరీ చేస్తున్న ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్​జోన్​ అడిషనల్​ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లిలోని మాంగర్ బస్తీకి చెందిన ఇస్మాయిల్(21), కాంబ్లే లక్ష్మణ్(40) పాత నేరస్తులు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు పిక్ ప్యాకెటింగ్ చేసి చాలాసార్లు జైలుకెళ్లి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత మాంగర్ బస్తీకి చెందిన మహ్మద్ అక్రమ్(35)తో కలిసి బస్సులో ప్యాసింజర్లే టార్గెట్​గా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ముగ్గురు కలిసి బస్సు ఎక్కి ప్యాసింజర్ల మెడలోని బంగారు నగలు, జేబుల్లోని క్యాష్​ను కొట్టేసేవారు.

ఈ నెల 7న కరీంనగర్​కు చెందిన కట్ట రమేశ్ సిటీకి వచ్చి సికింద్రాబాద్ లోని మహంకాళి టెంపుల్ వద్ద జువెలరీ షాప్​లో 24 గ్రాముల గోల్డ్ చైన్లు రెండు కొన్నాడు. వాటిని ప్యాంట్ జేబులో పెట్టుకుని చార్మినార్​కు వెళ్లి బంగారాన్ని అతికించే కెమికల్ కొన్నాడు. అక్కడి బస్సు ఎక్కి తిరిగి సికింద్రాబాద్​కు చేరుకున్నాడు. బస్సు దిగిన రమేశ్​ జేబులో చెక్ చేసుకోగా.. గోల్డ్ చైన్లు కనిపించలేదు. బస్సులో ఎవరో కొట్టేసినట్లు భావించిన రమేశ్​ గోపాలపురం పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేప
ట్టారు. బుధవారం రెజిమెంటల్ బజార్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇస్మాయిల్, లక్ష్మణ్, అక్రమ్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  10.25 గ్రాముల బంగారు నగలను స్వాధీనం 
చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల 10 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మరో కేసులో ముగ్గురు...

బస్సుల్లోనే చోరీలు చేస్తున్న మరో ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారంలో ఉండే శ్రీరామ్ సాయికుమార్(21), న్యూ బోయిగూడలో ఉండే కుంచపు సునీల్(26), చిలకలగూడ ఫుట్ పాత్​పై ఉంటూ టెంట్ హౌస్​లో పనిచేసే గంగాధర రాహుల్(19) జల్సాలకు బానిసై చోరీలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 30న చిక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కిన ఈ ముగ్గురు.. శరత్ అనే వ్యక్తి మెడలోని 12 గ్రాముల గోల్డ్ చైన్ కొట్టేశారు. శరత్ పోలీసులకు కంప్లయింట్ చేయడంతో కేసు ఫైల్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బుధవారం  రేతిఫైల్​బస్ స్టేషన్​వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయికుమార్, సునీల్, రాహుల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 40 వేల విలువైన 12 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పై రెండు కేసుల్లో నిందితులను రిమాండ్​కు తరలించినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు.