తెలంగాణలో బీజేపీకి ఇంకా ఎంతకాలం ఎదురుచూపులు?..ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీకి ఇంకా ఎంతకాలం ఎదురుచూపులు?..ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అబిడ్స్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘పక్క రాష్ట్రాల్లో పార్టీ గెలిస్తే ఇక్కడ డ్యాన్సులు చేయడం కాదు.. తెలంగాణలో పార్టీని ఎప్పుడు అధికారంలోకి తెస్తారో చెప్పండి’’ అని ప్రశ్నించారు. “వేరే వాళ్ల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసే పరిస్థితి మనకు ఇంకెంత కాలం?” అంటూ ఘాటుగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర నాయకులు తమ ఈగోలను పక్కన పెట్టి, కేడర్‌‌తో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్య నాయకులకు స్వేచ్ఛ ఇస్తే పార్టీ అధికారంలోకి రావచ్చని, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌‌లో కార్యకర్తలు చూపిన సంకల్పాన్ని చూసి తెలంగాణ నేతలు నేర్చుకోవాలని సూచించారు.