ప్రైవేట్ ట్రావెల్స్‌కు రూట్ క్లీయర్ చేస్తున్న సర్కార్

ప్రైవేట్ ట్రావెల్స్‌కు రూట్ క్లీయర్ చేస్తున్న సర్కార్

ఆర్టీసీ రూట్లు ప్రైవేట్‌ వైపు!

ప్రైవేటుకు సర్కారు సపోర్ట్‌ చేస్తోందంటున్న యూనియన్లు
ఫైనల్‌‌గా ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌కు అప్పజెప్పే ప్లాన్‌‌..?

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఇంటర్‌‌ స్టేట్‌‌ రూట్లను ప్రైవేట్‌‌కు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందా..? ఇంటర్ స్టేట్‌‌ ఒప్పందం పేరుతో ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌కు ఇన్ డైరెక్ట్‌‌గా రూట్లు ఇచ్చేసే ప్లాన్‌‌ నడుస్తోందా..? అంటే అవుననే ఆన్సర్లు వస్తున్నాయి. ఇన్‌‌డైరెక్ట్‌‌గా ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌కు లబ్ధి చేకూరేలా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోందని యూనియన్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. అందుకే ఇంటర్‌‌ స్టేట్‌‌ ఒప్పందంలో భాగంగా లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని ఏపీకి అల్టిమేటం జారీ చేసిందని.. అందువల్లే చర్చలు కొలిక్కి రావడం లేదని చెబుతున్నాయి.

ఏపీ ఒక మెట్టు దిగొచ్చినా.. నో యూజ్ 

కరోనాతో ఇంటర్‌‌ స్టేట్‌‌ బస్సులు ఆగిపోయాయి. ఏపీతో ఇంటర్‌‌ స్టేట్‌‌ అగ్రిమెంట్‌‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిపై ఏపీలో ఒకసారి, ఇక్కడోసారి చర్చలు జరిగాయి. తెలంగాణ బస్సులు ఏపీలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే, ఏపీ బస్సులు కూడా ఇక్కడ అన్ని కిలోమీటర్లే తిరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, తెలంగాణ బస్సులు ఏపీలో 1.52 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని, అప్పటి దాకా బస్సులు నడిపేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో ఏపీ మెట్టు దిగొచ్చి 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని లెటర్‌‌ రాసినా ఫలితం లేకపోయింది.

ఆ లక్ష కిలోమీటర్లు ఎట్ల భర్తీ చేస్తరు?

తెలంగాణలో ఏపీ బస్సులు1,006 తిరుగుతుండగా, ఏపీలో తెలంగాణ బస్సులు 746 వరకు ఉన్నాయి. లక్ష కిలోమీటర్లు తగ్గితే, దాని ప్రకారం 500 బస్సులు తగ్గుతాయి. ఈ లెక్కన చూసుకున్నా రోజుకు 20 వేల మంది ప్రయాణికుల జర్నీకి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. రెండు రాష్ట్రాలు బస్సులు నడపకపోవడంతో ఫైనల్‌‌గా ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ ఎంటర్‌‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతోనే తెలంగాణ సర్కారు ఇన్‌‌డైరెక్ట్‌‌గా ప్రైవేట్ కు సహకరిస్తోందని ఆర్టీసీ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. టీఎస్‌‌ ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు తగ్గినా ఇబ్బంది ఉండదని, ఉన్న బస్సుల్లోనే ఓఆర్‌‌ పెరుగుతుందని అంటున్నారు. లాంగ్‌‌ రూట్లలో ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ ఎంటరైతే ఆర్టీసీకి రెవెన్యూ తగ్గిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఇన్‌‌డైరెక్ట్‌‌గా ప్రైవేట్‌‌కు ఇచ్చే కుట్ర

ఇంటర్ స్టేట్ సర్వీసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిజాయతీగా లేనట్లు అనిపిస్తోంది. తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్న లక్ష కిలోమీటర్లను పెంచుకోవాలని ఏపీ ప్రపోజల్ చేసింది. లేకుంటే 50 వేల కి.మీ. పెంచుకోవాలని ప్రతిపాదించింది. ఈ రెండు ప్రపోజల్స్ సమంజసంగా ఉన్నాయి. కానీ లక్ష కి.మీ. తగ్గించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిపాదన చేయడమంటే, ఆ లక్ష కి.మీ. రూట్లను ప్రైవేటు రవాణా బస్సులు ఆక్రమిస్తాయి. ఇన్‌‌డైరెక్ట్‌‌గా ప్రైవేట్‌‌కు అప్పగించే కుట్ర జరుగుతోంది.

-కె.రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ,  ఈయూ

ఆర్టీసీని వీక్‌ చేసే కుట్ర: టీజేఎంయూ

రాష్ట్ర సర్కార్‌‌ తీరు ఆర్టీసీని వీక్‌‌ చేసి, ప్రైవేట్ బస్సులను ప్రోత్సహించేలా ఉందని తెలంగాణ జాతీయ మజ్దూర్‌‌ యూనియన్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌‌ ఆరోపించారు. ఇంటర్‌‌ స్టేట్‌ సర్వీసులపై ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిగాయని, కానీ టీఎస్ఆర్టీసీ వైపు నుంచి రెస్పాన్స్‌‌ లేదన్నారు. బస్సులు లేకపోతే బస్సులు కొనాలని, ఇందుకు ప్రభుత్వం ఫండ్స్‌‌ ఇవ్వాలని చెప్పారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్‌‌ నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఓ వైపు రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేట్ ట్రావెల్స్‌‌ బస్సులు నడిపిస్తూ లాభాలు గడిస్తుంటే, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇంటర్‌‌ స్టేట్ బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు.

For More News..

వర్క్ ఫ్రం హోం, అటెండెన్స్ రూల్స్.. గురుకులాల్లో అమలు కావట్లే

ఆరేంజ్ ఆ రేంజ్‌లో ఆడుతుందా?