
మెహిదీపట్నం, వెలుగు: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, హోం మినిస్టర్ మహమూద్ అలీని తక్షణమే బర్తరఫ్ చేయాలని బీఎస్పీ స్టేట్చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. సోమవారం బీఎస్పీ స్టేట్ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వెటర్నరీ డాక్టర్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ గా ఎలా నియమిస్తారు? పశుసంవర్థక శాఖ నుంచి క్రీడా శాఖకు ఎలా బదిలీ చేశారు’ అని ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
హరికృష్ణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు కాబట్టే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతనికి డిప్యుటేషన్ ఇచ్చారని, మంత్రికి అతడు ప్రధాన అనుచరుడు కాబట్టే ప్రభుత్వం అతన్ని కాపాడుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే సిట్ వేసి స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన లైంగిక వేధింపులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పాత బస్తీకి చెందిన సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బావజీర్ ను బండ్లగూడలో హత్య చేయడం దారుణమన్నారు.
హత్యకు ముందు హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారని విమర్శించారు. ప్రజల ప్రాణాలను రక్షించలేని హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకే అతన్ని హత్య చేశారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే రామాయంపేటలో ఖదీర్ ఖాన్ ను లాకప్ డెత్ చేశారని అన్నారు. తుంగతుర్తిలో నిందితులను చంపేస్తామని బెదిరించారని, బెల్లంపల్లిలో బీఎస్పీ కార్యకర్తపై స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని ప్రవీణ్కుమార్ఫైర్ అయ్యారు.