- జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం
- ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల నియామకం
- జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం
- డీఆర్సీ మీటింగ్స్‌కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు
- పదేండ్లు పక్కనపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (డీఆర్సీ) మీటింగ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించగా, ప్రత్యేక రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల పాటు వాటిని పక్కనపెట్టింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతానికి 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో డీఆర్సీ మీటింగులకు మినీ అసెంబ్లీ సమావేశాలుగా గుర్తింపు ఉండేది. జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులు, కావాల్సిన నిధులపై ఇన్చార్జ్ మంత్రుల సమక్షంలో సమగ్రంగా చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే డీఆర్సీ మీటింగ్స్ అసలు లక్ష్యం.
జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో డీఆర్సీ మీటింగ్స్ జరుగుతాయి. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగు నీరు, రోడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఇన్చార్జి మంత్రి నోట్‌చేసుకుని సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్మీటింగ్స్ లో చర్చించి పరిష్కరించే వీలుకలుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్ మంత్రులను నియమించారు.
డీఆర్సీ మీటింగ్స్ తర్వాతే సీఎం జిల్లాల టూర్..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నది. అయితే అందులో దాదాపు మూడు నెలలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో డీఆర్సీ మీటింగులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇటీవల కోడ్ ముగియడం, పాలన పట్టాలెక్కడంతో జిల్లాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లాల టూర్ కూడా ప్లాన్చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే డీఆర్సీ సమావేశాలు నిర్వహించి జిల్లాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజల ఇబ్బందులు, కావాల్సిన నిధులు వంటి వివరాలు ఇన్చార్జ్ మంత్రుల ద్వారా తెప్పించుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలు, రివ్యూలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు.
గతంలో మూడు నెలలకోసారి..
ఉమ్మడి ఏపీలో డీఆర్సీ మీటింగ్‌లను మినీ అసెంబ్లీ సమావేశాలుగా పిలిచేవారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించేది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగే ఈ మీటింగుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ పాల్గొనేవారు. కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు హాజరయ్యేవారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు, పెండింగ్‌పనులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఆ తర్వాత జరిగే మీటింగ్ లోపు ఈ సమస్యలు పరిష్కరించాలనే జవాబుదారీతనం అధికారుల్లో కనిపించేది. ఏదైనా సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే ఇన్చార్జ్ మంత్రుల ద్వారా రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే వీలుండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల పాటు ఈ వ్యవస్థను పక్కనపెట్టింది.