పార్ట్​ టైం ఇన్​స్ట్రక్టర్లను తొలగించిన రాష్ట్ర సర్కార్

పార్ట్​ టైం ఇన్​స్ట్రక్టర్లను తొలగించిన రాష్ట్ర సర్కార్
  • ఏటా 6,500 మందిని తీసుకుంటున్నట్లు కేంద్రానికి తప్పుడు లెక్కలు
  • ఇస్తున్న జీతం రూ.11,700.. రూ.14వేలు ఇస్తున్నట్లు నివేదికలు
  • రోడ్డునపడ్డ పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ల కుటుంబాలు

హైదరాబాద్​, వెలుగు: సమగ్ర శిక్ష అభియాన్​​(ఎస్​ఎస్​ఏ)లో మరో 2,500 మంది ఉద్యోగులను రాష్ట్ర సర్కార్​ తొలగించింది. ఇప్పటికే కేజీబీవీల్లో పనిచేస్తున్న వెయ్యిమంది టీచర్లు, పీఈటీలను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా పార్ట్​టైం ఇన్​స్ట్రక్టర్ల (పీటీఐ)ను ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు.. పీటీఐల విషయంలో ఎస్​ఎస్​ఏ అధికారులు.. కేంద్రానికి తప్పుడు నివేదికలను పంపిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 6,500కుపైగా పీటీఐలను తీసుకుంటున్నామని, వారికి రూ.14 వేల జీతం ఇస్తున్నామని లెక్కలు చూపంచారు. వాస్తవానికి రాష్ట్రంలో 2,500 మంది పీటీఐలే పనిచేస్తున్నారు. వారికి ఇస్తున్న జీతం కూడా రూ.11,700 మాత్రమే. ఈ నేపథ్యంలోనే పీటీఐలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం విచారణ చేస్తే అన్ని లెక్కలూ బయటపడతాయంటున్నారు. కేంద్రం నిధులతోనే జీతాలిస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు.  
ఏపీలో తీసుకున్నా.. ఇక్కడ తీసుకోవట్లే 
రాష్ట్రంలో ఎస్​ఎస్​ఏ పరిధిలో 2,500 మంది పనిచేసేవారు. ఆర్ట్​ (డ్రాయింగ్​, మ్యూజిక్​, డ్యాన్స్​)కేటగిరిలో 750 మంది, వర్క్​ ఎడ్యుకేషన్​ కింద1,300 మంది, పీఈటీలు (ఫిజికల్​ అండ్​ హెల్త్​) 450 మంది వరకూ పనిచేసేటోళ్లు. వాళ్లందరికీ పీఆర్సీ రాకముందు నెలకు రూ.9 వేల జీతం ఉండగా, ఇటీవల రూ.11,700 అందుతోంది. అయితే వారి జీతాల్లో 60% కేంద్రం, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది.
2021–22 అకడమిక్​ ఇయర్​ సెప్టెంబర్​లో ఫిజికల్​ క్లాసులు ప్రారంభం కాగా, చాలా జిల్లాల్లో నవంబర్​ నెలాఖరులో రిక్రూట్​ చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో జనవరి, ఫిబ్రవరిలోనూ తీసుకోవడం గమనార్హం. అయితే ఈ విద్యా సంవత్సరానికిగానూ వారిని తీసుకున్నా.. ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు. ఏప్రిల్​ 23న వాళ్లందరినీ తొలగించేశారు. ఎస్​ఎస్​ఏ పరిధిలో పనిచేసే మిగతా వాళ్లను తీసుకున్నా.. పీటీఐలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం వాళ్లను మళ్లీ తీసుకున్నారని, నెలకు రూ.14,200 జీతం ఇస్తున్నారని పీటీఐలు చెప్తున్నారు. 
అందరినీ రెగ్యులర్​ చేయాలె
రెగ్యులర్​ ఉద్యోగుల రిక్రూట్మెంట్​ మాదిరిగానే 2012లో పీటీఐలను నియమించారు. పదేండ్లుగా పనిచేస్తున్నా చాలా తక్కువ జీతం ఇస్తున్నరు. అన్ని అర్హతలు, అనుభవం ఉన్నా మాకు న్యాయం జరగట్లేదు. 12 నెలల జీతం కూడా ఇవ్వట్లేదు. అర్ధంతరంగా ఉద్యోగాల్లోంచి తీసేస్తే ఎట్లా బతకాలె? మళ్లీ రెన్యువల్​ చేయాలంటే పోరాటం చేయాల్సిందే. రాష్ట్రంలో తమ కాంట్రాక్టు రద్దు చేస్తే తామంతా వీధిన పడాల్సి వస్తది. కాబట్టి అందరినీ రెగ్యులర్​ చేయాలె. ‑ కనుకుంట్ల కృష్ణహరి, పీటీఐల సంఘం నేత

 

 

 

ఇవి కూడా చదవండి

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఊరు చిన్నదే.. ఎంజాయ్​మెంట్​కు మాత్రం తక్కువ లేదు