టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయ్యాల్టి నుంచే

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయ్యాల్టి నుంచే
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ 
  • మల్టీజోన్-1లో 15 .. మల్టీజోన్ -2లో 23 రోజులు 
  • 18,495 మంది టీచర్లకు పదోన్నతులు
  • 40 వేల మందికి బదిలీలు జరిగే అవకాశం 
  • టెట్​తో సంబంధం లేకుండా ప్రమోషన్లు
  • ఇదే షెడ్యూల్​లో పండిట్, పీఈటీల అప్​గ్రెడేషన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా మల్టీజోన్–1, మల్టీజోన్ –2కు వేర్వేరుగా షెడ్యూల్​ రిలీజ్ చేసింది. గతంలో కోర్టు కేసులతో ఎక్కడైతే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ సారి టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 

శుక్రవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్​ను విడుదల చేశారు. మల్టీజోన్ –1లో ఈ నెల 8 నుంచి 22 వరకు 15 రోజులు, మల్టీజోన్ –2లో ఈ నెల 8 నుంచి 30 వరకు మొత్తం 23 రోజుల పాటు ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఇదే షెడ్యూల్​లో ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న పండిట్, పీఈటీల అప్​గ్రేడేషన్ ప్రక్రియనూ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రస్తుతం 18,495 మందికి ప్రమోషన్లు రానుండగా, మరో 40 వేల మందికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది.మూడేండ్లలోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే, గత సంవత్సరమే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. కోర్టు కారణాలతో మధ్యంతరంగా ఆగిపోయింది. తాజాగా టెట్ తో సంబంధం లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వొచ్చని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. గతంలో 1,788 మంది హెడ్​మాస్టర్లు, 10,684 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. కాగా, గతంలో బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు రిలీవ్ కావాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. 

మల్టీజోన్ –1 షెడ్యూల్ ఇలా..

    8,9 వతేదీల్లో ప్రమోషన్ల కోసం ఎస్​జీటీ, దాని సమానమైన కేడర్ పోస్టులకు సంబంధించిన సీనియార్టీ లిస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రకటిస్తారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఎస్​జీటీ పోస్టుల ఖాళీల ప్రకటన ఉంటుంది 

    10,11వ తేదీల్లో సీనియార్టీ లిస్టుపై డీఈఓల అభ్యంతరాల స్వీకరణ 
    12న ఎస్​జీటీ కేడర్ ఫైనల్ సీనియార్టీ లిస్టు రిలీజ్​
    13 నుంచి16వరకు మేనేజ్​మెంట్లవారీగా స్కూల్ అసిస్టెంట్, దాని సమానమైన కేడర్ పోస్టుల ప్రమోషన్లకు వెబ్ ఆప్షన్లు, ప్రమోషన్ ఆర్డర్లు జారీ 
    17న ఎస్​జీటీ వేకెన్సీల జాబితా, రోస్టర్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ లిస్టు 
    18 నుంచి 20 వరకు ఫైనల్ సీనియార్టీ లిస్టు ప్రకటన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 
    21,22న ట్రాన్స్​ఫర్ ఆర్డర్లు అందజేత

మల్టీజోన్– 2లో ఇలా..

    8,9వ తేదీల్లో జిల్లా పరిషత్ మేనేజ్​మెంట్​హెడ్మాస్టర్ల ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్ లేదా దాని సమానమైన కేడర్ పోస్టులకు సంబంధించిన టీచర్ల  ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు రిలీజ్,  ఆబ్జెక్షన్ల స్వీకరణ, సమస్యల పరిష్కారం 

    10,11వ తేదీల్లో ఫైనల్ సీనియార్టీ లిస్టు, ప్రమోషన్ ఆర్డర్స్ జారీ, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం ఎస్​జీటీలు, దానికి సమానమైన కేడర్ ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు 
    12,13 వ తేదీల్లో  ప్రమోషన్ల తర్వాత స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీ  లిస్టు
    14,15న సీనియార్టీ లిస్టుపై ఆబ్జెక్షన్లు, డీఈఓలకు ఫిర్యాదులకు అవకాశం 
    16–18 వరకు ఫైనల్ సీనియార్టీ లిస్టు, స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్​ఫర్స్​కు వెబ్ ఆప్షన్లు, ఎడిట్ ఆప్షన్,  ఎస్​జీటీ, దాని సమానమైన కేడర్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ సీనియార్టీ లిస్టు
    19న స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు
    20న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం ఖాళీల లిస్టు 
    21 నుంచి 24 ఎస్​జీటీల ఫైనల్ సీనియార్టీ లిస్టు, వెబ్ ఆప్షన్లు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఆర్డర్స్ 
    25న ఎస్​జీటీ వేకెన్సీల లిస్టు , ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు, ఆబ్జెక్షన్ల స్వీకరణ 
    26–28 వరకూ సీనియార్టీ లిస్టు, వెబ్ ఆప్షన్ల స్వీకరణ , ఎడిట్ ఆప్షన్ 
    29,30వ తేదీల్లో టాన్స్ ఫర్స్​ఆర్డర్ల అందజేత

ప్రమోషన్లు జరగబోయే పోస్టులు

హెడ్​మాస్టర్లు                              763
స్కూల్ అసిస్టెంట్స్​                   5,123 
పీడీ, ఎస్​ఏ లాంగ్వేజీ                10,479 
మొత్తం                                       18,495