
హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాలు, నిబంధనలకు తగ్గట్టు డిప్యూటేషన్లపై పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల వివరాలను తమకు సబ్మిట్ చేయాలని డీపీవో (జిల్లా పంచాయతీ అధికారులు)లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల డైరెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.
ఉద్యోగుల తుది కేటాయింపు ప్రక్రియ సందర్భంగా పనిచేస్తున్న చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు గతంలో బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శుల ‘ఇంటర్ లోకల్ కేడర్ టెంపరెరీ ట్రాన్స్ఫర్స్/ డిప్యూటీషన్ల’కు సంబంధించి మార్గదర్శకాలు పంపించినట్లు తెలియజేశారు.
2021 డిసెంబర్‌లో జీవో 317 అమలు సందర్భంగా బదిలీ, ఆ తర్వాత 2022 ఫిబ్రవరి, 2024 సెప్టెంబర్‌లలో ఇచ్చిన రీ అలాట్‌మెంట్ల సందర్భంగా ప్రయోజనం లభించని వారిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు డీపీవోలకు ఓ మెమో ద్వారా పీఆర్ శాఖ సమాచారం పంపించింది.
పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌కు టీపీఎస్ఏ కృతజ్ఞతలు
జీవో 317 జీవోతో నష్టపోయిన కార్యదర్శులకు జీవో 190కు అనుగుణంగా డిప్యూటేషన్లు కల్పించాలని పీఆర్,ఆర్డీ డైరెక్టర్ జి.సృజనకు వినతిపత్రం అందజేసినట్లు తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ (టీపీఎస్‌ఏ) అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి తెలిపారు.
తమ విజ్ఞప్తిపై స్పందించిన డైరెక్టర్.. అన్ని జిల్లాలకు మెమో జారీ చేస్తూ ప్రొఫార్మెలో కార్యదర్శుల వివరాలను పంపించాలని డీపీవోలను ఆదేశించినట్టు తెలిపారు. వివరాలు అందాక డిప్యూటేషన్లు చేస్తామని తెలిపిన డైరెక్టర్ సృజనకు టీపీఎస్‌ఏ సంఘం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.