పెద్దాస్పత్రులకు క్యూ.. వరుస వానలతో మారిపోయిన వాతావరణ పరిస్థితులు

పెద్దాస్పత్రులకు క్యూ..  వరుస వానలతో  మారిపోయిన వాతావరణ పరిస్థితులు
  • సీజనల్ వ్యాధుల బారినపడుతున్న సిటీజనం 
  • ఓపీకి వస్తున్న వారితో కిక్కిరిస్తున్న సర్కారు ఆస్పత్రులు  

హైదరాబాద్‌, వెలుగు :  సిటీలో సర్కారు పెద్దాస్పత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి.  వరుస వానల కారణంగా సీజనల్​వ్యాధులు ప్రబలుతుండడమే కాకుండా పలు అనారోగ్య లక్షణాలతో బాధపడుతూ ప్రజలు తెల్లవారుజామునుంచే ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా రాష్ర్టవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా జిల్లాల నుంచి వచ్చే పేషెంట్ల రాలేకపోయారు. రెండు రోజులుగా వానలు తగ్గముఖం పట్టడడంతో  మళ్లీ రద్దీ పెరిగింది. దీంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్, ఈఎన్‌టీ  తదితర ఆస్పత్రులతో ప్రతిరోజూ వచ్చే ఓపీ పేషెంట్ల కన్నా 400 –500 వరకు అదనంగా వస్తున్నారు. దీంతో ఓపీతో పాటు ఐపీ రోగుల సంఖ్య సామర్థ్యానికి మించి నమోదవుతున్నట్లు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే.. రద్దీతో గంటల  తరబడి క్యూలైన్ లో నిలబడాల్సి వస్తుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు  సిటీలోని బస్తీ దవాఖాన్లకు కూడా పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది.

 సాయంత్రం కూడా ఓపీ సేవలు 

ఉస్మానియాకు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి 2 వేల నుంచి 2,200 వరకు రోగులు వస్తుంటారు.  సోమవారం ఒక్కరోజే 2,455 మంది రావడంతో  ఆస్పత్రి పరిసరాల్లో రద్దీ నెలకొంది. గాంధీకి కూడా 2,600 మందికి పైగా వచ్చారు. ఆయా ఆస్పత్రుల్లో గంటల తరబడి వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎన్‌టీ ఆస్పత్రి ఒక్కటే ఉండగా పేషెంట్ల రద్దీ పెరిగిపోతుండగా  ఓపీ కోసం క్యూలో నిల్చునే పరిస్థితి తలెత్తింది.  అయితే.. ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం 4 గంటల నుంచి  6గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్లు సూచించారు. వీటిని 5 శాతం మంది కూడా వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. 

  సీజనల్‌ వ్యాధుల వారే ఎక్కువగా..

వరుస వర్షాలతో  సీజనల్ వ్యాధులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజుల తరబడి ముంపు కాలనీల్లో వరదనీళ్లు ఉంటున్నాయి. దీంతో దోమలు పెరిగిపోయి జ్వరం, జలుపు, దగ్గు, డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి.