
- కొండారెడ్డిపల్లి, చెన్నూరు, మధిర, జినోమ్ వ్యాలీలో ఏర్పాటు!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల (ఐటీఐ) ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా మధిర, శామీర్‌పేట శివారులోని జినోమ్ వ్యాలీలో ఐటీఐలను నెలకొల్పనున్నట్లు కార్మిక శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు, వచ్చే కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జినోమ్ వ్యాలీలో సీఎం పర్యటించిన సందర్భంగా.. ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఉన్నందున టెక్నికల్ ఉద్యోగాలకు అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ aఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ నాలుగు ప్రాంతాల్లో ఐటీఐల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభిం చనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో 98 % అడ్మిషన్లు పూర్తి కావడంతో, ఎక్కడెక్కడ ఐటీఐల అవసరం ఉందనే దానిపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఈ ప్రతిపాదనలకు తగ్గట్టు మరో నాలుగు ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.