ఉపాధిపై ఉత్తమాటలు..అన్ని ఉద్యోగాలొస్తే నిరుద్యోగం ఎందుకున్నది.?

ఉపాధిపై ఉత్తమాటలు..అన్ని ఉద్యోగాలొస్తే నిరుద్యోగం ఎందుకున్నది.?

రాష్ట్రంలో సుమారుగా 50 శాతం ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉపాధి పొందుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగం చాలా యాంత్రికమైపోయింది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లతో వ్యవసాయరంగంలో ఉపాధి చాలా వరకు తగ్గిపోయింది. ఇక ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో ఉన్నా, అవి పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను ఏమాత్రం తీర్చలేవు. ఇకపోతే ప్రైవేటు సంస్థలు ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు సంస్థలను, పరిశ్రమలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం సరళీకృత విధానాన్ని పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొదలు పెట్టింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా సరళీకృత విధానాన్ని అమలు చేయడానికి, అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏకీకృత (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ సెక్టార్​కు బీజం పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి నిబంధనలను సులభతరం చేస్తూ, అలాగే పరిశ్రమల స్థాపన కోసం ఒక మైత్రిపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు 2014లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్​ఐపాస్​ చట్టం తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ముఖ్యంగా ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు ఏర్పడ్డాయి.

అంకెల్లో తేడాలు..

రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి ఈ ఏడాది జనవరి 2న పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు టీఎస్​ఐపాస్​ద్వారా రూ. 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని తద్వారా 22.5 లక్షల మందికి ఉద్యోగాలు దొరికాయని చెప్పారు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు మంత్రి చెప్పిన అంకెలు సత్యదూరంగా అనిపించి, సమాచార హక్కు చట్టం ద్వారా పరిశ్రమల శాఖ కమిషనర్​కు వివరాల కోసం దరఖాస్తు చేశాను. ఆ అప్లికేషన్​కు వారు స్పందిస్తూ.. టీఎస్​ఐపాస్​ కింద 23,322 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, దాంతో రాష్ట్రంలో 2.67 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని, అలాగే 17.82 లక్షల ఉద్యోగ కల్పనకు వీలుందని తెలిపారు. అయితే ఇంతవరకు నికరంగా వచ్చిన పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాల వివరాలు వారు చెప్పలేకపోయారు. చాలా పరిశ్రమలతో ఒప్పందాలు జరిగినా ఇంతవరకు వారు పెట్టిన పెట్టుబడి ఎంత ? ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయి? అన్న వివరాలు మాత్రం ఎవరి వద్దా లేవు. చాలామట్టుకు పరిశ్రమల్లో ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’’ అన్న చందాన పరిశ్రమల శాఖ వారు రాని పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చినట్లు చూపిస్తూ.. ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నట్లు అనుమానం కలుగకమానదు.

వెల్డింగ్​ దుకాణాలు, పిండిమరలు

గత తొమ్మిది ఏండ్లుగా రాజకీయ నాయకులు టీఎస్​ఐపాస్​ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, సాధించింది కొంత మాత్రమే. టీఎస్​ఐపాస్​ ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమల జాబితా చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ పరిశ్రమలేమిటో తెలంగాణ ప్రజలు కూడా చూడాల్సిందే. వాటిలో కొన్ని పక్క టేబుల్​లో ఉన్నాయి. ఇలా టీఎస్​ఐపాస్​లో అనుమతులు పొందిన పరిశ్రమలు చాలా వరకు పిండిమరలు, వెల్డింగ్ పనులు, ఇటుక పనులు, స్టోన్ క్రషర్ వంటివి ఉన్నాయి. ఇలాంటి చిన్న పరిశ్రమలు ఇంతకు పూర్వం కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదు, తెచ్చిందేమీ లేదు. ఇలాంటి పనులకు పెద్దగా అనుమతులు కూడా తప్పనిసరి ఏం కాదు.

అన్ని ఉద్యోగాలొస్తే.. నిరుద్యోగం ఎందుకున్నది?

పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా టీఎస్​ ఐపాస్​ద్వారా వచ్చినవే అని గొప్పలు చెబుతున్నారు. వాటిలో కొన్ని ఇదివరకే పని మొదలైనవి ఉన్నాయి. ఉదాహరణకు మెట్రో రైలు, జీఎంఆర్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటివి. ఇంకా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంటులు, భారత డైనమిక్స్ వంటివి టీఎస్ ​ఐపాస్​ఖాతాలో ఉన్నాయి. ఈ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు. వీటికి రాష్ట్ర అనుమతుల కంటే కేంద్ర అనుమతులు చాలా కావాలి. ఇకపోతే టీఎస్​ఐపాస్ ​కింద అనుమతులు పొందినట్లు చెబుతున్నవి ఇంకా కొన్ని పరిశ్రమలు ఉన్నాయి.- ఫోనిక్స్ కన్​స్ట్రక్షన్, అపర్ణ హౌసింగ్, మై హెూమ్ కన్​స్ట్రక్షన్స్ మొదలైనవి. ఈ రియల్ ఎస్టేట్ పనులు చూడడానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఇందులో టీఎస్​ ఐపాస్​ప్రమేయమేమీ లేదు. కానీ ఇలాంటి అన్నింటినీ తమ ఖాతాలో వేసుకొని పరిశ్రమల శాఖ వారు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. చేసింది కొంతయితే చెప్పేది చాంతాడంతగా ఉన్నది. రాష్ట్ర ప్రజలకు టీఎస్​ఐపాస్ ​ద్వారా వచ్చిన పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాల వివరాల సంగతి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ పరిశ్రమల మంత్రివర్యులు చెప్పిన విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు 22.5 లక్షల ఉద్యోగాలు వచ్చి యువత ఉపాధి పొందుతుంటే.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు ఉన్నదన్నదే అంతులేని ప్రశ్న.

- ఎం. పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ ​గుడ్​ గవర్నెన్స్​