సీఎం ప్రకటించి 6 నెలలైనా.. పీవీ విద్యాపీఠం స్టార్ట్ కాలే

సీఎం ప్రకటించి 6 నెలలైనా.. పీవీ విద్యాపీఠం స్టార్ట్ కాలే
  • రూ.3 కోట్లతో ప్రపోజల్స్ పంపిన కేయూ అధికారులు
  • పైసా విడుదల చేయని రాష్ట్ర సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం, రచనలపై అధ్యయనం కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన పీవీ విద్యాపీఠం హామీ నోటిమాటగానే మిగిలిపోయింది. తెలంగాణ నుంచి ప్రధానిగా ఎదిగి ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మార్చిన పీవీ పేరిట కాకతీయ యూనివర్సిటీలో విద్యా పీఠం ఏర్పాటు చేస్తామని ఆయన శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా జూన్ 28న సీఎం కేసీఆర్ ప్రకటించారు. హామీ ఇచ్చి ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. కేయూ అధికారులు వెంటనే ప్రపోజల్స్ రెడీ చేసి పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. దీంతో పీఠం ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. అలాగే కొన్ని ప్రభుత్వ పథకాలకు పీవీ పేరును పెడతామని ఇచ్చిన హామీని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. పీవీ స్వగ్రామంతోపాటు, ఢిల్లీలో పీవీ విగ్రహాల ఏర్పాటు కూడా ముందుకు సాగడం లేదు. 

అధికారుల ప్రపోజల్స్ ఇవీ.. 
పీవీ విద్యా పీఠం ఏర్పాటు కోసం యూనివర్సిటీ అధికారులు రూ.3 కోట్ల వ్యయంతో ప్రపోజల్స్ రెడీ చేశారు. ఈ పీఠం బాధ్యతలు చూసుకునేందుకు ఒక ప్రొఫెసర్ ను, ఫీల్డ్ లో విషయ సేకరణ కోసం ఇద్దరు రీసెర్చ్ అసోసియేట్స్ ను నియమించుకోవాలని అందులో పేర్కొన్నారు. పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, వాటి ఫలితాలపై రీసెర్చ్ పేపర్లను పబ్లిష్ చేసేందుకు ఒక జర్నల్ కూడా తేవాలని ప్రపోజల్ పెట్టారు. కేయూలో పీవీ పేరిట నిర్మించబోయే బిల్డింగ్ కు రూ.కోటి సహా మొత్తం రూ.3 కోట్లు కేటాయించాలని రాష్ట్ర సర్కార్ ను కోరారు. బిల్డింగ్ నిర్మించే వరకు యూనివర్సిటీ లోని ఓ బిల్డింగ్ లో తాత్కాలికంగా పీఠాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి పైసా కూడా రాకపోవడంతో ఆ ఆలోచననూ విరమించుకున్నట్లు తెలిసింది.