సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
  • మున్సిపాలిటీలకు పీసీసీ ఇన్​చార్జీల నియామకం
  • చేర్యాలలో 50 ఓటర్లకో ఇన్​చార్జి
  • మండల నేతలకూ వార్డుల బాధ్యత

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్  స్పెషల్  ఫోకస్ పెట్టింది. పొలింగ్  దగ్గర పడుతుండడంతో ఇంటింటి ప్రచారాన్ని స్పీడప్​ చేయడంతో పాటు గెలుపు కోసం ప్రత్యేక వ్యూహానికి పదును పెడుతోంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్​చార్జీలను పీసీసీ ప్రకటించింది. నియోజకవర్గ ఇన్​చార్జీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

స్థానిక నేతలతో పాటు ముఖ్య నేతలు మున్సిపాల్టీల్లో పర్యటించి కాంగ్రెస్  అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మండల నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, సర్పంచులకు వార్డుల ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రతి రోజు ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రూపొందించారు. వీరికి తోడు ముఖ్య నేతలు కార్నర్  మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్  వెంకటస్వామి సైతం  ఆయా మున్సిపాలిటీల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొననున్నారు.

50 ఓటర్లకో ఇన్​చార్జి..

చేర్యాల మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 50 ఓటర్లకు ఒక ఇన్​చార్జిని నియమించి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్  ఇన్​చార్జి కొమ్మూరి ప్రతాప్​రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి చేర్యాల మున్సిపోల్స్ ను పర్యవేక్షిస్తున్నారు. మైక్రో మేనేజ్​మెంట్ తో వారి విజయానికి పావులు కదుపుతున్నారు. మండల నేతలకు ప్రచార బాధ్యత అప్పగించడంతో వార్డుల్లో ప్రచారం హోరెత్తుతోంది.

విజయం కోసం ఐక్యంగా..

గజ్వేల్  మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో గ్రూపు విభేదాలను పక్కన పెట్టి విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 20 వార్డులకు ముఖ్య నేతలను ఇన్​చార్జీలుగా నియమించాడు. గజ్వేల్ మండల ముఖ్య నేతలు, కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించి పర్యవేక్షిస్తున్నారు. ఆయా మండలాలకు చెందిన నేతలు, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం..

హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్  తీసుకున్నారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం చేస్తూనే, కార్నర్  మీటింగ్ లతో కాంగ్రెస్  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. తానే స్వయంగా ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన మంత్రి మరో రౌండ్  ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. పట్టణ నేతలను ఒక్కో వార్డుకు ఇన్​చార్జిగా నియమించడంతో పాటు అభ్యర్థితో సంబంధం లేకుండా మండల  నాయకులు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించేలా ప్లాన్​ చేశారు.

దుబ్బాకలో త్రిముఖ పోటీ..

దుబ్బాక మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఉండగా, కాంగ్రెస్  ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి మండల పార్టీ శ్రేణులతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఇన్​చార్జీలను నియమించి ఏఎంసీ చైర్మన్లు, డైరక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్లతో పాటు మండల ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండగా, గెలిచే అవకాశాలను వదులుకోవద్దనే ఉద్దేశంతో చెరుకు శ్రీనివాసరెడ్డి వ్యూహాలకు పదును 
పెడుతున్నారు.

ఇన్​చార్జీలు వీరే..

గజ్వేల్  ప్రజ్ఞాపూర్ కు కూన శ్రీశైలం గౌడ్, దుబ్బాకకు వనం శ్రీనివాస్,  చేర్యాలకు మెట్టు సాయి కుమార్, హుస్నాబాద్ కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లను ఇన్​చార్జీలుగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్  గౌడ్ నియమించారు. వీరంతా తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లో వచ్చే మూడు రోజుల పాటు ప్రచార బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.

వార్డుల వారీగా మేనిఫెస్టోలు

మెదక్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ ముఖ్య నాయకుల ప్రచారం కంటే సొంత మేనిఫెస్టోల మీద ఎక్కువగా ఫోకస్  పెడుతున్నారు. ప్రభుత్వం, పార్టీ ఏమి చేసింది, చేస్తుందనే విషయాన్ని చెప్పడం కంటే తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే ఏం చేస్తామనే విషయాన్ని ఓటర్లకు చెబుతున్నారు. వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆడపిల్ల పుడితే సొంతగా రూ.5 వేల ఆర్థికసాయం, పేదింటి అమ్మాయి పెళ్లయితే బహుమతిగా రూ.5,116 అందజేస్తామని, ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చు కోసం ఆర్థికసాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.

కొందరు అభ్యర్థులు పోస్టాఫీస్  ద్వారా రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని  చెబుతుండగా, మరి కొందరు అభ్యర్థులు సొంత ఖర్చుతో వాటర్  ప్లాంట్  ఏర్పాటు చేసి రూపాయికే 20 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఉచిత టైలరింగ్  శిక్షణ ఇప్పిస్తామని, సొంత డబ్బులతో కుట్టు మిషన్లు కొనిస్తామని మాటిస్తున్నారు. కుల సంఘాలకు ఫంక్షన్ లకు అవసరమైన వంట పాత్రలు, టెంట్  సామగ్రి ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా సొంత మేనిఫెస్టోలతో ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టోలను కరపత్రాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.