- ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలపై ఫిర్యాదులకూ పోర్టల్
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం
- సాఫ్ట్‌వేర్ పనుల్లోబీటెక్ చదివిన ఎస్జీటీలు
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్స్కూళ్ల టీచర్లు, సిబ్బంది ఇకపై తమ వ్యక్తిగత పనుల కోసం ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు. మెడికల్ లీవ్స్, ఇతర దేశాలకు వెళ్లేందుకు ఎన్‌వోసీ కావాలంటే.. ఒక్క క్లిక్‌తో పని పూర్తయ్యేలా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖలోని అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి టీజీ ఆన్ లైన్ పేరుతో కొత్త మాడ్యూల్స్ సిద్ధం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజు నాటికి ఇది అందుబాటులోకి రావాలని డెడ్ లైన్ విధించారు.
పారదర్శకత కోసమే..
టీచర్లకు సంబంధించిన సర్వీస్ మేటర్స్‌లో పారదర్శకత కోసం పలు మాడ్యూల్స్‌ను రూపొందిస్తున్నారు. లీవ్ మాడ్యుల్, ఎన్వోసీలు, గ్రీవెన్స్ సెల్‌ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూన్ 12 తర్వాత మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా లీవ్ మాడ్యుల్లో మెడికల్ లీవ్, ఎక్స్‌ట్రార్డినరీ లీవ్ వంటి దీర్ఘకాలిక సెలవుల కోసం ఇకపై ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా ఇతర అవసరాల కోసం తీసుకునే ఎన్‌వోసీల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నారు. దీంతోపాటు టీచర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం, క్రమశిక్షణ చర్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ తీసుకురానున్నారు. తమ అప్పీళ్లను కూడా ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదులకూ అవకాశం ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలపై పేరెంట్స్, ఎన్జీవోలు ఫిర్యాదు చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తోంది. ఇప్పటివరకు సెంట్రలైజ్డ్ ట్రాకింగ్ సిస్టమ్ లేకపోవడంతో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇకపై ఫిర్యాదు ఎక్కడ ఉంది.. దానిపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అన్నది బాధితులకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుస్తుంది.
ప్రతి శనివారం సమీక్ష
ఈ డిజిటల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు బీటెక్ విద్యార్హత ఉన్న ఇద్దరు, ముగ్గురు ఎస్జీటీల సేవలను 2 నెలలపాటు డైరెక్టరేట్ ఆఫీస్‌లో వినియోగించుకునేందుకు అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లకు అనుమతి లభించింది. వీరంతా టీజీ ఆన్‌లైన్ టీమ్‌తో కలిసి ఈ మాడ్యూల్స్ డిజైన్ చేయనున్నారు. ఈ పనులను నిరంతరం సమీక్షించేందుకు ప్రతి శనివారం సాయంత్రం 4.30 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని సేవలు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావాలని ఇప్పటికే డెడ్‌లైన్ పెట్టుకున్నారు.
