భూ కబ్జాలపై ఉక్కుపాదం

భూ కబ్జాలపై ఉక్కుపాదం
  • ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం!
  • బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్​ సర్వేలు
  • ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్​, సంగారెడ్డి జిల్లాల్లో యాక్షన్​
  • తాజాగా హైదరాబాద్​ పరిసరాల్లోని కబ్జాదారులపై చర్యలు
  • ఫిర్యాదులు, రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు..!
  • గత సర్కారు హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు
  • సైబరాబాద్​, హైదరాబాద్​, రాచకొండ కమిషనరేట్లలోని 
  • ఒక్కో పీఎస్​లోనే యావరేజ్​గా 9 కబ్జా కేసులు
  • ప్రజావాణికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2,670

హైదరాబాద్, వెలుగు: భూ కబ్జాలపై రాష్ట్ర సర్కార్​ ఉక్కుపాదం మోపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ  స్థలాలు కబ్జాలకు గురయ్యాయి ? అందులో ప్రభుత్వానికి చెందిన స్థలాలు, ప్రైవేట్​ వ్యక్తులకు సంబంధించినవి ఏవి?  పోలీసులకు వచ్చిన కంప్లయింట్స్​ ఏమిటి ? రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న సమాచారం ఏమిటనే వివరాలను తెప్పించుకుంటున్నది. 

 ప్రధానంగా హైదరాబాద్​ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లో కబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల గురించి ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి ఇంటర్నల్​ రిపోర్ట్​ తెప్పించుకున్నారు. హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో భూ ఆక్రమణ, కబ్జాదారులపై పోలీసు కమిషనర్లు మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రతి పోలీస్​ స్టేషన్​లో యావరేజ్​గా 9  భూకబ్జా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

ప్రైమ్​ ఏరియాల్లో భూకబ్జాలకు లెక్కలేకుండా పోయింది. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు ప్రభుత్వం, పోలీసుల దృష్టిలో ఉన్నవాటిపైనా నివేదికను తయారు చేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఇష్యూతో కబ్జాల వ్యవహారాన్ని సీఎం రేవంత్​రెడ్డి మరింత సీరియస్​గా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారో ఆరా తీస్తున్నారు. 

తన ప్రభుత్వంలోనూ ఎవరైనా కబ్జా వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఫీల్డ్​ సర్వే చేయించి తిరిగి బాధితులకు భూములను అప్పగించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్​, సిరిసిల్ల, మెదక్​, సంగారెడ్డి జిల్లాల్లో కబ్జారాయుళ్లపై  పోలీసులు కేసులు నమోదు చేసి.. చర్యలకు దిగారు. 

బీఆర్​ఎస్​ హయాంలో రెచ్చిపోయిన కబ్జాదారులు

గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగినట్లు రాష్ట్ర సర్కార్​ గుర్తించింది. ఇందులో బీఆర్​ఎస్​ లీడర్లు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఒక్క ఫైనాన్షియల్​ డిస్ర్టిక్ట్​ పరిధిలోనే భూ కబ్జాలకు  సంబంధించి 690కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.  రెండు జిల్లాల​ పరిధిలో ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారమే 3 వేలకు పైగా ఫిర్యాదులు ఉన్నాయని సెక్రటేరియెట్​లోని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు.

ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జా చేశారనే దానిపై ప్రభుత్వ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నది. రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​ గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గత ప్రభుత్వంలో అప్పటి కొందరు మంత్రుల అండదండలతో అక్రమార్కులు యథేఛ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రధానంగా సిటీ లిమిట్స్​లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి కనుసన్నల్లోనే కబ్జాలు జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇందులో బీఆర్​ఎస్​ లీడర్లు ఎవరు ఉన్నారో వారి సమాచారం కూడా తీస్తున్నారు. ఒకవేళ వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీలో ఉన్నా సరే.. కబ్జాల విషయంలో సీరియస్​గానే ఉండాలని పోలీస్​ కమిషనర్లకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. కబ్జాలకు ఎవరైనా పోలీసులు, అధికారులు సహకరించి ఉంటే వాళ్లపైనా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ భూములకు సంబంధించి జీవో నంబర్లు 58, 59 కింద రెగ్యులరైజ్​ చేసుకునేందుకు ఎవరెవరు ఎలాంటి ఆధారాలు సమర్పించారో రాష్ట్ర సర్కార్​ ఆరా తీస్తున్నది. అప్పటికప్పుడు ప్రభుత్వ భూముల్లో తిష్ట వేసి, కాగితాలు సృష్టించిన వారిపైనా క్రిమినల్​ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నది. 

క్యూ కడ్తున్న బాధితులు

ప్రభుత్వం మారినప్పటి నుంచి భూ కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు క్యూ కడ్తున్నారు. గత పదేండ్లలో జరిగిన అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రజావాణికి పెద్ద ఎత్తున కంప్లయింట్స్​ వచ్చాయి. దీంట్లో రాష్ట్రవ్యాప్తంగా భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 2,670. లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రజావాణికి బ్రేక్​ పడింది. మళ్లీ ప్రజావాణి మొదలైతే ఇలాంటి ఫిర్యాదులు ఇంకా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

అలా వస్తున్న కంప్లయింట్స్​పై జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ కు.. హైదరాబాద్​, మేడ్చల్ మల్కాజ్​ గిరి, రంగారెడ్డి పరిధిలోని అయితే పోలీసు కమిషనర్లకు, కలెక్టర్లకు ఫిర్యాదులను పంపి పరిష్కరించాలని ఆదేశించనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఫీల్డ్​ సర్వే చేయించాలనుకుంటున్నారు. ఇక కొందరికి హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ.. కబ్జారాయుళ్లు ఆయా భూముల నుంచి కదలడం లేదు.

వీరిపై చర్యలకు రంగంలోకి దిగాలని పోలీసులను సీఎం రేవంత్​ ఆదేశించినట్లు తెలిసింది. కబ్జాలను నియంత్రించేందుకు పోలీసు కమిషనర్లకు సర్వ అధికారాలను ప్రభుత్వం ఇచ్చినట్లు సమాచారం.