సర్కారు బడి.. రాయరాదు.. సదవరాదు!

సర్కారు బడి.. రాయరాదు.. సదవరాదు!
  • 3.16 లక్షల మంది స్టూడెంట్స్ కు తెలుగు రాదు 
  • 4.52 లక్షల మంది ఇంగ్లిష్ లో వీక్  
  • 48.79 శాతం మందికి లెక్కలురావు 
  • ఏమీ రానోళ్లు సగం మంది!

సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల పెంపున కు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నా.. అవి ఏమాత్రం సత్ఫలితాలివ్వడం లేదు. హైస్కూల్ స్థాయి విద్యార్థులకూ తెలుగు చదవడం, రాయడం రానివాళ్లు మూడోవంతు ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.విద్యాశాఖ నిర్వహించిన ఓ పరీక్షలోనే ఇలాంటి విస్తుగొలిపే ఫలితాలు బయటపడ్డాయి.

గతేడాది పాఠశాల విద్యాశాఖ చదవడం, రాయడం, లెక్కించడం (త్రీఆర్ ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైస్కూల్‌ స్థాయి వరకూ ప్రతి తరగతిలోనూ ‘త్రీఆర్‌ ’కు ఒక పిరియడ్ కేటాయించారు. చదవడం, రాయడం రాని విద్యార్థుల్లో త్రీఆర్‌ కార్యక్రమం కాస్త మార్పు తెచ్చింది. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా.. అమలు విషయంలో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో ప్రీటెస్టు పేరుతో విద్యార్థుల సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించారు. కొన్ని బడుల్లో సెప్టెంబర్ వరకూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ మార్కులను ఆన్‌ లైన్ ద్వారా విద్యాశాఖ డైరెక్టరేట్‌ కు పంపించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ప్రీటెస్ట్ ఫ లితాలతో టీచర్లు, అధికారులు తలలు పట్టుకున్నారు.

ప్రీటెస్ట్ రాసిన 9.39లక్షల విద్యార్థులు
తెలంగాణలో చైల్డ్ ఇన్‌ ఫో లెక్కల ప్రకారం 3 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులు మొత్తం 38,68,067 మంది ఉన్నారు. దీంట్లో బాలురు 19,92,471 మంది కాగా, 18,75,566 మంది బాలికలున్నారు. అయితే కేవలం సర్కారు బడుల్లోని విద్యార్థులకు మాత్రమే ప్రీటెస్ట్ నిర్వహించారు. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాల పై పరీక్షలు జరిగాయి. రాష్ర్టవ్యాప్తంగా 9,39,657 మంది ఈ పరీక్ష రాశారు. వీరిలో 4,51,465 మంది బాలురు, 4,88,190 మంది బాలికలు. దీంట్లో తెలుగు సరిగా చదవడం, రాయడం రాని విద్యార్థులు 33.66 శాతం, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం రాని విద్యార్థులు 48.13 శాతం, లెక్కలు సరిగా చేయని విద్యార్థులు 48.79 శాతం ఉన్నట్టు తేలింది. ఈ మూడు చేయలేని వారు 49.98 శాతం ఉన్నారని గుర్తించారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపని విద్యార్థులకు 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏప్రిల్‌ లో పోస్ట్ టెస్ట్‌‌ నిర్వహించనున్నారు.

3.16 లక్షల మంది స్టూడెంట్స్ కు తెలుగు రాదు
రాష్ర్టంలో 3 నుం చి 9వ తరగతి విద్యార్థుల్లో 3,16,332 మందికి తెలుగు భాష చదవడం, రాయడం రాదని ప్రీటెస్ట్‌‌లో తేలింది. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉన్నారు. సరిగా తెలుగును చదవలేని, రాయలేని విద్యార్థుల్లో 1,63,244 మంది బాలురు ఉండగా, 1,53,087 మంది బాలికలున్నారు. హైదరాబాద్‌ లో పరీక్ష రాసిన 70,030 మందిలో 17,770 మందికి, సంగారెడ్డిలో 68,716 మందిలో 25,011 మందికి, కరీం నగర్‌ లో 26,636 మందికి గానూ 16,818 మందికి తెలుగు సరిగా రాదని తేలింది. తెలుగులో చిన్నచిన్న పదాలు కూడా చదవడం, రాయని వాళ్లు పెద్దసంఖ్యలోనే ఉన్నారని అధికారులు చెప్తున్నారు.

4.52 లక్షల మంది ఇంగ్లిష్ లో వీక్
ఇంగ్లిష్ భాష లోనూ పెద్దగా ప్రతిభ కనిపించ లేదు. పరీక్ష రాసిన 9,36,657 మందిలో 4,52,316 మందికి ఇంగ్లిష్ చదవడం కానీ, రాయడం కానీ రాదని తేలింది. హైదరాబాద్‌ లో తెలుగురాని వారికంటే ఇంగ్లిష్‌ రానివారి సంఖ్యే ఎక్కువ. మిగిలిన అర్బన్‌ ఏరియాల్లోనూ ఇదే దుస్థితి.

48.79 శాతం మందికి లెక్కలురావు
ప్రీటెస్ట్‌‌లో అత్యధికంగా లెక్కలు రాని విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు ఫలితాలను స్పష్టం చేస్తున్నాయి. పరీక్ష రాసిన వారిలో 4,58,519 మంది విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, భాగహారాలు రావని తేలింది. లెక్కలు రానోళ్లదాంట్లో బాల బాలికలు దాదాపు సమానంగానే ఉన్నారు. బాలికలు 2,29,303 మంది, బాలురు 2,29,215 మంది లెక్కల్లో వీక్‌ గా ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌ లో 27,790 మందికి, ఖమ్మంలో 24,126 మందికి లెక్కలు రావని తేలింది.

ఏమీ రానోళ్లు సగం మంది!
పరీక్ష రాసిన వారిలో సగం మంది(49.98శాతం) కి మూడు విభాగాల్లో (తెలుగు, ఇంగ్లిష్ , లెక్కలు) ఏమీ రానట్టు ప్రీటెస్ట్ ద్వారా తేలింది. ఓవరాల్‌ గా 4,69,712 మంది ఈ మూడు విభాగాల్లో వెనక బడ్డారు. వీరిలో బాలురు,34,673 మంది, బాలిక లు 2,35,039 మంది ఉన్నారు.