హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపర్చే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి బోధనా విధానాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ టీచర్లను సింగపూర్‌కు పంపేందుకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో వారం రోజుల పాటు ఈ స్టడీ టూర్ నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ విదేశీ యాత్ర కోసం సుమారు 40 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ టూర్‌కు వెళ్లే టీచర్లను జిల్లాల వారీగా కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. విద్యాబోధనలో మంచి పనితీరు చూపుతున్న, నిబద్ధతతో పనిచేస్తున్న టీచర్లకే అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ బృందం ఫిన్లాండ్ వెళ్లి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చింది.
