
- 2013 నుంచి సర్కారు చర్యలు తీసుకోవడంలేదు
- ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే జరపాలి
- ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్. బాబు డిమాండ్
- 27న చేపట్టనున్న ‘చలో బస్‌భవన్’ వాల్ పోస్టర్ విడుదల
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ప్రెసిడెంట్ ఎస్. బాబు డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న చలో బస్‌భవన్ వాల్ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2013 అక్టోబర్‌లోనే జీవో విడుదలైందని, అయినా సర్కార్ ఎలాంటి చర్య తీసుకోవడంలేదన్నారు. కండక్టర్, డ్రైవర్లపై మేనేజ్‌మెంట్, చెకింగ్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, దీంతో వారు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 వేతన సవరణ నేటికీ అమలు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని, ఆర్టీసీ మేనేజ్‌మెంట్ ఎన్నికల అధికారికి సహకరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఐదేళ్లుగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ జరగకపోవడంతో కార్మికులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మహిళా కండక్టర్లకు అన్ని డిపోల్లో ప్రత్యేక చార్టులను ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్‌లను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సీసీఎస్, పీఎఫ్ లోన్లు విడుదల చేయాలని, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్బీటీ లోన్లు పురుద్ధరించాలని కోరారు. చలో బస్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆర్టీసీ సిబ్బందికి పిలుపునిచ్చారు.