- ఈ నెల 9 నుంచి 21 వరకు వేలం
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ( క్యూర్) పరిధిలోని డబుల్ బెడ్‌రూం కాలనీల్లో ఉన్న షాపులను ప్రభుత్వం వేలం వేయనుంది. క్యూర్ పరిధిలోని 36 కాలనీల్లో మొత్తం 1400 షాపులకు ఈ నెల 9 నుంచి 21 వరకు వేలం నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ బుధవారం వెల్లడించారు. షాపుల వేలంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు సైతం ఇచ్చారన్నారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీల్లో, స్థానికుల అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా 60 స్కేర్ ఫీట్స్ నుంచి -400 స్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో పలు షాపులు ఉన్నాయన్నారు.
ఈ షాపుల ధరలను సైతం బహిరంగ మార్కెట్ కంటే తక్కువకే ఖరారు చేశామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆయా కాలనీలను సందర్శించి, తమకు నచ్చిన, అనువైన షాపులను ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు నిర్ణయించిన మొత్తంతో వేలం నిర్వహించే తేదీల్లో ఉదయం 11 గంటల్లోగా సంబంధిత ఆర్డీవో ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
వేలం నిధులు కాలనీల అభివృద్ధికే...
డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీల్లో షాపుల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా కాలనీల అభివృద్ధికే వినియోగిస్తామని ఎండీ స్పష్టం చేశారు. ఇందు కోసం సహకార చట్టం కింద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేస్తారని, వాటి ఆధ్వర్యంలో ఆయా కాలనీల నిర్వహణ, -అభివృద్ధి కోసం జాయింట్ అకౌంట్ ద్వారా ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రకటించారు.
వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్పస్ ఫండ్‌గా డిపాజిట్ చేసి, ప్లాట్లలో ప్రతి నెలా మెయింటెనెన్స్ వసూలు చేసి ఆ డబ్బులతో కాలనీల నిర్వహణను చేపడతారన్నారు. కామన్ ఏరియాల్లో పనులు, చిన్న చిన్న రిపేర్ల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, ఈ నిధులను వినియోగించుకునేలా ఏర్పాటుచేశామన్నారు.
వేలం నిర్వహించే తేదీలు
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 కాలనీల్లో ఉన్న 77 దుకాణాలకు ఈ నెల 15, 16 తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లో 892 షాపులకు 15, 17 తేదీల్లో, సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరు కాలనీల్లో ఉన్న 372 షాపులకు 15 నుంచి 18వ తేదీ వరకు వేలం వేయనున్నారు. మిగిలిన షాపులకు ఈ నెల 21న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. దుకాణాల వేలానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను సంప్రదించాలని ఎండీ వీపీ గౌతం సూచించారు.
