ఫూలే గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : ఆది శ్రీనివాస్​

ఫూలే గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : ఆది శ్రీనివాస్​
  • పదేండ్లు అధికారంలో ఉండి మీరెందుకు ఆయన విగ్రహం పెట్టలే 

హైదరాబాద్, వెలుగు :  మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. ఏనాడైనా ఫూలే జయంతికి గానీ, వర్ధంతికిగానీ కేసీఆర్​ హాజరయ్యారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ ఓట్ల కోసమే ఫూలే విగ్రహమంటూ కవిత కొత్త మాట ఎత్తుకున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియా హాల్​లో మాట్లాడారు.

ఈడీ నోటీసులొచ్చిన ప్రతిసారీ కవిత ఇలాంటి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తారన్నారు. బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో ఫూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం పెట్టకుండా.. ఇప్పుడు తమకు డెడ్​లైన్​ పెట్టడం రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. ఫూలే విగ్రహంపై రాజకీయం చేస్తున్నదే కవిత అని విమర్శించారు. ఫూలే ఆశయాలను నెరవేర్చేది కాంగ్రెస్​ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రెండు చోట్ల ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

కవిత చెప్తేనే ప్రగతిభవన్​ను జ్యోతిరావు ఫూలే భవన్​గా మార్చామా అని నిలదీశారు. ఎప్పుడు ఏం చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. కవిత ఏం చేసినా రాజకీయం కోసమే చేస్తుందని, గతంలో బతుకమ్మను పూర్తి రాజకీయంగా మార్చింది ఆమేనని అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కేవలం ఒక్క చోటే పోటీనిస్తుందన్నారు.