పోడు భూముల జోలికొస్తే ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించండి

పోడు భూముల జోలికొస్తే ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించండి
  • పోడు భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు.. యుద్ధమే
  • సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీ టీసీలంతా పోరాడాలి
  • ఫారెస్టోళ్లను గ్రామాలకు రానివ్వొద్దని పిలుపు
  • ప్రభుత్వంలో భాగమైన విప్ ప్రజలను రెచ్చగొడితే మాకు భద్రతేది అంటున్న ఆఫీసర్లు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల జోలికి వచ్చే ఫారెస్ట్​ ఆఫీసర్లపై ఇక ప్రత్యక్ష యుద్ధం చేస్తామని.. పోరాటానికి గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రెడీ కావాలని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు​ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన మంగళవారం ఫేస్​బుక్​లో పెట్టిన పోస్టులు పొలిటికల్, ఫారెస్ట్​డిపార్ట్​మెంట్ సర్కిళ్లలో కలకలం రేపుతున్నాయి. సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని హరితహారం కింద మొక్కలు నాటుతున్నారు. ఎలక్షన్ల ముందు పోడుభూములకు పట్టాలిస్తమని చెప్పిన సర్కారు, తీరా ఇప్పుడు ఉన్న భూములను గుంజుకోవడం ఏంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పబ్లిక్ నుంచి విప్ రేగాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా రేగా వివిధ వేదికలపై ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఫారెస్టోళ్లపై విరుచుకుపడుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు ఇచ్చిన పట్టాలున్నప్పటికీ ఫారెస్ట్ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారని పలు మీటింగ్​ల్లో ఆయన వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫేస్​బుక్ వేదికగా ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుపై రేగా మండిపడ్డారు. పోడు భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని, అసలు వాళ్లను గ్రామాల్లోకి రానీయవద్దని, ఒకవేళ వస్తే నిర్బంధించాలని తన నియోజకవర్గ ప్రజలకు, లోకల్ ప్రజాప్రతినిధులకు రేగా పిలుపు ఇచ్చారు. తాను హైదరాబాద్​నుంచి వచ్చాక ఫారెస్ట్ ఆఫీసర్లతో ప్రత్యక్ష యుద్ధం తప్పదని, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలంతా ఐక్య పోరాటానికి రెడీ కావాలని, ఆ దిశగా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ‘‘ఇక ఫారెస్ట్​ ఆఫీసర్లతో అమీతుమీ తేల్చుకుందాం.. లేకపోతే మన జీవితాలు రోడ్లపై అడుక్కొని తినుడే..’ అంటూ రేగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, తాము ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలనే పాటిస్తామని, అలాంటిది ప్రభుత్వంలో కొనసాగుతున్న విప్​కాంతారావు తమపై పోరాటానికి పబ్లిక్​ను రెచ్చగొట్టడం ఏమిటని ఫారెస్ట్​ ఆఫీసర్లు అంటున్నారు. ఆయన పోస్టులతో ఎవరైనా రెచ్చిపోయి తమపై దాడులు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.