
టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడంపై ఉత్కంఠ వీడింది. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆగస్టు 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళిసై చర్చించారు. ఈ బిల్లులోని కొన్ని విషయాలపై వివరాలు తీసుకున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుపై సమగ్ర రిపోర్టును తీసుకున్న అనంతరం..బిల్లు డ్రాఫ్ట్ కు గవర్నర్ ఆమోదం వేశారు.
ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై కన్సెంట్ కూడా ఇచ్చారు. దీంతో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీకి తీసుకొచ్చారు. గవర్నర్ తో జరిగిన భేటీలో చర్చించిన అంశాలపై సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలపనున్నారు. దీంతో ఇవాళే ఆర్టీసీ విలీనం బిల్లును శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.