తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య మరో వివాదం

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య మరో వివాదం

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్కు మధ్య మరో వివాదం రాజుకుంది. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ ఆహ్వానంపై రగడ నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాకపోవడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్ భవన్ ప్రకటించింది. ఈ మేరకు రాజ్ భవన్  ఓ నోట్ విడుదల చేసింది.  

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఎలాంటి  ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ వెల్లడించింది. సచివాలయం  ప్రారంభానికి ఆహ్వానం పంపినా కూడా గవర్నర్ హాజరు కాలేదని  రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించడాన్ని గవర్నర్ తిప్పికొట్టారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆహ్వానం రానందున గవర్నర్ హాజురు కాలేదని రాజ్ భవన్  వర్గాలు  ప్రకటించాయి. 

ఏప్రిల్ 30న  తెలంగాణ కొత్త సచివాలయాన్ని  సీఎం కేసీఆర్  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  2500 మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.  అయితే  గవర్నర్ కు మాత్రం ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం నుండి ఆహ్వానం రానందువల్లే ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని ప్రకటనలో చెప్పారు.
 

నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండని వ్యాఖ్యానించారు. రావడం రాకపోవడం గవర్నర్ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకని.. సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. కాబట్టే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదని ఆరోపణలు చేశారు.