బషీర్‌బాగ్, వెలుగు: క్లాస్ రూముల్లో పిల్లలకు పాఠాలే కాకుండా ప్రపంచాన్ని కూడా పరిచయం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఐటీసీ లిమిటెడ్ ప్లాగ్ షిప్ కార్యక్రమం ‘వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (డబ్ల్యూఓడబ్ల్యూ)’ వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీసైక్లింగ్ చాంపియన్లకు ఐటీసీ వావ్ పురస్కారాలను అందజేశారు. వ్యర్థాల నుంచి వనరులను సృష్టించిన పాఠశాల విద్యార్థులను అభినందించారు.
స్వచ్ఛభారత్‌లో పిల్లలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమన్నారు. వ్యర్థాల విభజన, రీసైక్లింగ్ కార్యక్రమంలో విద్యార్థులను, విద్యా సంస్థలను భాగస్వామ్యులను చేయడం వల్ల చిన్న వయస్సు నుంచి పర్యావరణ బాధ్యత, సుస్థిరత సంస్కృతిని పెంపొందిస్తుందన్నారు.
