ఉద్యోగాలకు కొదవ లేదు.. కానీ, యువతలో స్కిల్స్ కొరత ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఉద్యోగాలకు కొదవ లేదు.. కానీ, యువతలో స్కిల్స్ కొరత ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వారధిలా పనిచేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. దేశం, రాష్ట్రాల  అభివృద్ధిలో ఇండస్ట్రీలు కీ రోల్ పోషిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. శనివారం సోమాజిగూడలోని  ఓ హోటల్ లో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యారు. సస్టైనబుల్ తెలంగాణ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. 

సస్టైనబిలిటీ, పోటీతత్వ తెలంగాణ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. వరల్డ్ బెస్ట్ ఇన్నోవేషన్ హబ్​లలో హైదరాబాద్ ఒకటని పేర్కొన్నారు. ‘‘మన దగ్గర ఉద్యోగాలకు కొదవ లేదు. కానీ, నిరుద్యోగ యువతలో స్కిల్స్ కొరత ఉంది. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్ లో తెలంగాణ ముందుంది. కొత్తగా వస్తున్న టెక్నాలజీపై ఎప్పటికప్పుడు నిరుద్యోగులు అప్ డేట్ కావాలి”అని ఆయన సూచించారు. 

‘‘నేను నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాను. అందరూ అతిథి దేవోభవ అంటుంటారు. కానీ, మనం ప్రగతి దేవోభవ అనాలి. వివేక్ వెంకటస్వామి మినిస్టర్ కాకముందు నుంచే నాకు తెలుసు. యూత్ లో స్కిల్స్ నేర్పించేందుకు ముందడుగేస్తున్న ఆయన్ని అభినందిస్తున్నాను.   మనతో పాటు మనతోటి ఇండస్ట్రీలను ఎదగనియ్యాలి. అందరం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే కోరుకుంటున్నారు” అని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో తనకు ఇదే లాస్ట్ స్పీచ్ అని.. తాను మహారాష్ట్రకు వెళ్లిపోతున్నానని గవర్నర్​ తెలిపారు. విద్యార్థులకు హోమ్ సిక్ ఉన్నట్టు.. తనకు హైదరాబాద్ సిక్ ఉంటుందేమో అని అన్నారు.

ట్రిలియన్ ఎకానమే మా లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెయ్యాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘2043 వరకు వన్ ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే మా లక్ష్యం. ఇటీవల రాష్ట్రంలో జరిగిన సమిట్ లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. వాటి ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. సీఐఐ ఈవెంట్ లో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. దేశవ్యాప్తంగా క్లీన్  అండ్  గ్రీన్ పరిశ్రమల కోసం సీఐఐ కృషిచేస్తోంది. సీఐఐ త్రిపురలో కూడా ఉంది.

నిరుద్యోగ యువతలో స్కిల్స్ పెంచటం కోసం ఐటీఐలను అప్ గ్రేడ్ చేయటం కోసం రాష్ట్రంలో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను ఏర్పాటు చేశాం. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందాలంటే ఏ స్కిల్స్ ఉండాలన్నది ఇండస్ట్రీలు చెప్పాలి. ఆ కోర్సులపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఆయా కోర్సులను ఏటీసీల్లో స్టార్ట్ చేస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యం. ఇండస్ట్రీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నదే మా లక్ష్యం”అని మంత్రి అన్నారు.

ఇటీవల పఠాన్ చెరువులో జరిగిన సిగాచి ఇండస్ట్రీ ఘటన చాలా బాధాకరమని, ఈ ఘటనపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఇదంతా కార్మికుల సంక్షేమం కోసమేనని.. పరిశ్రమలు దీనిని అర్థం చేసుకోవాలన్నారు.

కార్మికుల భద్రత, సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని, అన్ని కంపెనీలు ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని, వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. కార్మికుల కోసం కేంద్రం కొత్త లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని, వాటిని అమలు చేయాలని మంత్రి పారిశ్రామికవేత్తలను కోరారు. కార్మికులు బాగుంటేనే..ఇండస్ట్రీలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.